ఇసుక తోడుడు మళ్లా షురూ

ఇసుక తోడుడు మళ్లా షురూ
  • పాలమూరు జిల్లాలో మొదలైన ఇసుక అక్రమ రవాణా
  • గ్రౌండ్​ వాటర్​ పడిపోతుండడంతో ఆందోళనలో రైతులు

మహబూబ్​నగర్, వెలుగు: పాలమూరు జిల్లాలో పొలిటికల్​ లీడర్లు ఇసుక తోడుడు మళ్లీ షురూ చేసిన్రు. దొంగచాటుగా రాత్రిళ్లు జేసీబీలను వాగుల్లోకి దింపి ట్రాక్టర్లు, లారీల్లోకి ఎత్తి పెద్ద మొత్తంలో ఇసుక తరలిస్తున్నారు. విషయం తెలుసుకొని స్థానికులు అడ్డుకుంటే ‘మీ దిక్కున్న చోట చెప్పుకోండి’ అంటూ వార్నింగ్​లు ఇస్తున్నారు. ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి 48 గంటల్లో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ఉన్నతాధికారులకు ఆర్డర్స్ ఇచ్చినా, వాటిని బేఖాతర్​ చేస్తున్నారు.​

కొద్ది రోజులే బ్రేక్..

గత ప్రభుత్వ హయాంలో పాలమూరు జిల్లాలోని ఊకచెట్టువాగు, దుందుభి వాగుల నుంచి పెద్ద మొత్తంలో ఇసుకను తరలించారు. అప్పటి ఎమ్మెల్యేలు, వారి బినామీల కనుసన్నల్లోనే ఈ దందా జరిగింది. ప్రభుత్వం మారాక అధికారంలోకి వచ్చిన కొత్త ఎమ్మెల్యేలు ఇల్లీగల్​ దందాలపై ఉక్కుపాదం మోపాలని రెవెన్యూ, పోలీస్​ డిపార్ట్​మెంట్​లను ఆదేశించారు.

దీంతో వారు ఎక్కడికక్కడ ఇసుకను సీజ్​ చేసి కేసులు నమోదు చేయడంతో ఈ  దందాకు బ్రేక్​ పడినట్లైంది. దాదాపు రెండు నెలల వరకు ఎవరూ సప్పుడు చేయలేదు. ఇప్పుడీ దందా మళ్లీ మొదలైంది. గత ప్రభుత్వంలో దందా నిర్వహించిన లీడర్లు ఇటీవల పార్టీలు మారారు. పాత తహసీల్దార్లు, ఎస్ఐలు, సీఐలు బదిలీ కాగా.. కొత్తగా వచ్చిన వారిని పరిచయం చేసుకునే ప్రయత్నంలో పడ్డారు. ఇప్పటికే కొందరు వాగుల్లోకి జేసీబీలను దింపి దందాను ప్రారంభించారు. ప్రధానంగా దుందుభీ, ఊకచెట్టువాగుల పొంటి నాలుగు రోజులు ఇసక తరలింపుపై పంచాయితీలు నడుస్తున్నాయి. 

సీఎం ఆర్డర్స్​ ఇచ్చినా..

ఐదు రోజుల కింద సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి 48 గంటల్లో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ఆఫీసర్లకు ఆర్డర్లు ఇచ్చారు. కలెక్టర్లు కూడా జిల్లా, మండల స్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించి ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయాలని ఆదేశాలిచ్చారు. కానీ, జిల్లాలో ఇంత వరకు రెవెన్యూ, పోలీస్​ డిపార్ట్​మెంట్లు సీరియస్​గా దీన్ని అరికట్టడంపై దృష్టి పెట్టలేదు. ఈ రెండు వాగుల నుంచి అర్ధరాత్రి, తెల్లవారుజాముల్లో ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమంగా తరలిస్తున్నా తనిఖీలు చేసి దాడులు చేయడం లేదు. 

వేగంగా పడిపోతున్న గ్రౌండ్​ వాటర్..​

జిల్లాలో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఇప్పటికే చెరువుల్లో నీళ్లు అడిగంటిపోయాయి. యాసంగి పంటలకు నీరు లేక కొందరు రైతులు భూములను పడావు పెట్టారు. బోర్ల కింద సాగు చేసుకుంటున్న రైతులు పంటలను కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటున్నారు. గత డిసెంబర్​లో జిల్లాలో భూగర్భ జలాలు 8.24 మీటర్ల లోతులో ఉండగా, నెల వ్యవధిలోనే 8.88 మీటర్ల లెవల్​కు పడిపోయాయి.

ఈ క్రమంలో వాగుల నుంచి మళ్లీ ఇసుక తోడుతుండడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సాగులో ఉన్న పంటలను కాపాడుకోవడానికి నీళ్లు అందుబాటులో లేవని, వాగుల్లో ఉన్న కొద్ది పాటి ఇసుకను కూడా తరలిస్తే బోర్లు మొత్తం ఎండిపోతాయని ఆవేదన చెందుతున్నారు..

Also read : 3 జిల్లాల్లో అర్హులెందరు .. సివిల్ సప్లై అధికారుల కసరత్తు

11 మందిని బైండోవర్​ చేశాం..

మూడు రోజుల నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న 11 మందిని బైండోవర్​ చేశాం. వీరంతా పళ్లమర్రి, లాల్​కోట, పర్దిపూర్​తండా, సీతారాంపేట్, మద్దూరు గ్రామాలకు చెందిన వారు. ఇసుక అక్రమ రవాణాపై సీరియస్​ యాక్షన్​ తీసుకుంటున్నాం. ఎవరైనా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే రూ.5 లక్షల వరకు ఫైన్​ వేస్తాం.
- ఆర్  శేఖర్, ఎస్ఐ, చిన్నచింతకుంట