అన్నారం షరీఫ్ దర్గాలో ఘనంగా గంధం ఊరేగింపు

  • తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా వచ్చిన భక్తులు
  • ఆకట్టుకున్న ఖవ్వాలి గీతాలు, ఫకీర్ల విన్యాసాలు

పర్వతగిరి, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన వరంగల్​జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గా ఉర్సు గురువారం రాత్రి అంగరంగ వైభవంగా మొదలైంది. రెండు రాష్ట్రాల నుంచి హాజరైన భక్తులు ‘సంథల్’(గంధం) ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొని హజ్రత్ సయ్యద్ యాకూబ్ షావలికి గంధం సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఖవ్వాలి గీతాలు, ఫకీర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 

తొలిరోజు దర్గా ప్రధాన ముజేవార్ బోలేషావలి ఇంటి వద్ద ముజేవార్లు పాషా, గౌష్​పాషా, ఖాజాపాషా తదితరులు గంధం పూజలను నిర్వహించారు. అనంతరం భక్తుల కోలాహలం నడుమ ఊరేగింపు చేపట్టారు.  హైదరాబాద్, వరంగల్ నుంచి వచ్చిన ఫకీర్లు తమ విన్యాసాలతో భక్తులను అలరించారు. దర్గా ప్రాంగణంలో  వక్ఫ్ బోర్డు ఆఫీసర్లు విద్యుత్ దీపాలతో అలంకరించారు. 

యాకూబ్​బాబా దర్గాతో పాటు గౌస్ పాషా, మెహబూబియా, బోలేషావాలి, గుంషావళి దర్గాల వద్ద భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు.  రెండో రోజు శుక్రవారం అన్నదానం, దీపారాధన, ఖవ్వాలి పాటలు ఉంటాయని వక్ఫ్ బోర్డు ఇన్ స్పెక్టర్ రియాజ్ తెలిపారు.  అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈస్ట్​జోన్​డీసీపీ రవీందర్, మామునూర్​ఏసీపీ తిరుపతి,  పర్వతగిరి సీఐ రాజగోపాల్​, ఎస్ఐలు ప్రవీణ్​, నరేశ్​కుమార్, కృష్ణవేణి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు కొనసాగించారు.