పర్వతగిరి, వెలుగు: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారంలో ఉర్సు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ముజావార్లు, ముస్లిం మతపెద్దలు యాకూబ్బాబాకు గురువారం అర్ధరాత్రి గంధం, చాదర్, పూలమాలలు సమర్పించారు. దర్గా ప్రధాన ముజావార్ బోలేషావళి ఇంటి వద్ద నుంచి ముజావార్లు, మతపెద్దలు ఖవ్వాలి పాటలు పాడుతూ గంధం(సంథల్) పూజలు చేశారు. అనంతరం గ్రామ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపులో ఫకీర్ల విన్యాసాలు, ఖవ్వాలి పాటలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఇనుప చువ్వలతో గుచ్చుకుని చేసిన విన్యాసాలు భక్తులను అబ్బురపరిచాయి.
ఊరేగింపు సందర్భంగా గంధంను తాకేందుకు భక్తులు పోటీపడ్డారు. ఉత్సవాల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మత సామరస్యానికి ప్రతీకగా అన్నారం దర్గా విరజిల్లుతోందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ రియాజ్, సొసైటీ చైర్మన్ మనోజ్గౌడ్, లీడర్లు షబ్బీర్ అలీ, జడల కృష్ణ, సారంగపాణి, భిక్షపతి, రమేశ్, రాజేశ్వర్రావు, రాజు పాల్గొన్నారు.