మూడ్రోజుల సీబీఐ కస్టడీకి సందీప్ ఘోష్

  • తాలా పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్​వో కూడా..
  • కోల్​కతా ట్రైయినీ డాక్టర్ కేసులో సెల్దా కోర్టు విచారణ

కోల్​కతా: ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ ఎస్​హెచ్​వో అభిజీత్​ను కలకత్తా కోర్టు.. ఈ నెల 17 వరకు సీబీఐ కస్టడీకి అప్పగించింది. ట్రైనీ డాక్టర్​పై రేప్, మర్డర్ కేసు విషయంలో వీరిద్దరు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సీబీఐ అధికారులు ఆరోపిస్తున్నారు. సెమినార్ హాల్​లోని ఎవిడెన్స్​ను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడంలోనూ కుట్ర పూరితంగానే ఆలస్యం చేసినట్లు సీబీఐ అధికారులు కోర్టుకు వివరించారు. 

ట్రైయినీ డాక్టర్ హత్య తర్వాత ఇద్దరూ ఫోన్​లో మాట్లాడుకున్నారని, చాటింగ్ చేసుకున్నారని తెలిపారు. క్రైమ్ సీన్​ను ఎస్​హెచ్​వో అభిజీత్ ఉదయం 11 గంటలకు పరిశీలించారని, రాత్రి 11 గంటలకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారని కోర్టుకు వివరించారు. ఇద్దరూ కలిసి కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారని చెప్పారు. తమ కస్టడీకి అప్పగిస్తే మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చని చెప్పారు. వాదనలు విన్న కోర్టు.. మూడు రోజుల కస్టడీకి అప్పగిస్తున్నట్లు ప్రకటించింది.

ఆరో రోజుకు జూడాల నిరసన

బెంగాల్ హెల్త్ డిపార్ట్​మెంట్ హెడ్​క్వార్టర్ ముందు జూనియర్ డాకర్ల ఆందోళన కొనసాగుతూనే ఉన్నది. వీరి నిరసన ఆదివారంతో ఆరో రోజుకు చేరుకున్నది. కోల్​కతా సీపీతో పాటు హెల్త్ డిపార్ట్​మెంట్ సీనియర్ అధికారులు తమ పదవులకు రాజీనామా చేయాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.