విద్యుత్​ శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా

విద్యుత్​ శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా
  •  జీహెచ్ఎంసీ కమిషనర్​గా ఇలంబర్తి
  • ఆరుగురు ఐఏఎస్​లకు ఇన్ చార్జ్​​ బాధ్యతలు    

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ నుంచి రిలీవ్‌‌ అయిన ఐఏఎస్‌‌ల స్థానాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌‌చార్జిలను నియమించింది. డీవోపీటీ ఆదేశాల మేరకు.. తెలంగాణ నుంచి వాణిప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి రిలీవ్ అయ్యారు. దీంతో వారి డ్యూటీని చూసుకునేందుకు ఇతర ఐఏఎస్​లకు ఇన్ చార్జ్​ బాధ్యతలను సీఎస్ ​శాంతికుమారి అప్పగించారు. 

జీవో ప్రకారం.. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న  సందీప్​ కుమార్​ సుల్తానియాకు  విద్యుత్‌‌ శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీగా,  ట్రాన్స్​పోర్ట్​ కమిషనర్​గా ఉన్న ఇలంబర్తిని జీహెచ్‌‌ఎంసీ కమిషనర్‌‌గా,  టూరిజం శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎస్సీ డెవలప్​మెంట్​ సెక్రటరీ ఎన్‌‌.శ్రీధర్​కు, మహిళా సంక్షేమశాఖ కార్యదర్శిగా టి.కె.శ్రీదేవి,  హెల్త్​ అండ్​ ఫ్యామిలీ వెల్ఫేర్​ కమిషనర్​ ఆర్​.వి కర్ణన్​కు ఆరోగ్యశ్రీ హెల్త్‌‌కేర్‌‌ ట్రస్ట్‌‌ సీఈవోగా, హెల్త్​ సెక్రటరీ  క్రిస్టినాకు ఆయుష్‌‌  డైరెక్టర్‌‌గా పూర్తి అదనపు  బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

పునర్విభజన చట్టం ప్రకారం కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్ట్‌‌ చేయాలని డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫ్‌‌ పర్సనల్‌‌ అండ్‌‌ ట్రైనింగ్‌‌ విభాగం (డీఓపీటీ) ఐఏఎస్‌‌ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్‌‌ అధికారులు క్యాట్‌‌, హైకోర్టును ఆశ్రయించినా ఊరట దక్కలేదు. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్​ వాళ్లు ఆ రాష్ట్రంలో రిపోర్ట్​ చేయాల్సిందేనని.. ఏపీలో ఉన్న తెలంగాణ క్యాడర్​ ఐఏఎస్​లు కూడా వారి సొంత రాష్ట్రంలో రిపోర్ట్​ చేయాల్సిందేనని బుధవారం డెడ్​లైన్​ విధించింది. 

ఈ నేపథ్యంలో  వాణిప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యారు. అంతకు ముందు వారంతా సీఎస్​ను కలిసి చర్చించి.. రిలీవ్​ ఆర్డర్లతో ఏపీకి వెళ్లి రిపోర్ట్​ చేశారు. ఇక  ఏపీ నుంచి రిలీవ్‌‌ అయిన ఐఏఎస్ లు సృజన, హరికిరణ్, శివశంకర్ రాష్ట్ర సీఎస్‌‌ శాంతికుమారిని సచివాలయంలో కలిసి రిపోర్టు చేశారు. వారికి త్వరలోనే పోస్టులను కేటాయించనున్నారు. ఐపీఎస్‌‌లు అంజనీ కుమార్, అభిలాష బిస్త్​లకు సంబంధించి ఇంకా కేంద్ర హోం శాఖ నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో రిలీవ్ కాలేదని తెలిసింది.

త్వరలోనే ఐఏఎస్​ల శాఖల్లో మార్పులు

ముఖ్యమైన శాఖలకు సంబంధించిన ఐఏఎస్​లు తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లడంతో మరోసారి కొన్ని శాఖల్లో సీనియర్​ ఐఏఎస్​లకు స్థానచలనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. పనితీరు ఆధారంగా ఇప్పుడు ఇన్ చార్జ్​ బాధ్యతలు చూస్తున్న వారి స్థానంలో పూర్తిస్థాయిలో నియమించాలని అనుకుంటున్నది. అదే సమయంలో ఏపీ నుంచి తెలంగాణకు వచ్చిన ఐఏఎస్​లకు ఏ శాఖలు ఇవ్వాలనే దానిపైనా కసరత్తు చేస్తున్నది. దీంతో మరొకసారి శాఖల హెచ్​ఓడీల్లో మార్పులు ఉంటాయని సెక్రటేరియెట్​ వర్గాల్లో చర్చ జరుగుతోంది.