మదనాపురం/వీపనగండ్ల, వెలుగు: వనపర్తి జిల్లాలోని అన్ని జలాశయాల్లో ఆగస్టు వరకు సరిపడా తాగునీరు ఉందని, నల్లాల ద్వారా తాగునీటిని అందిస్తామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. సోమవారం జిల్లాలోని జలాశయాల్లోని నీటి నిల్వలు, తాగునీటి సరఫరా గురించి తెలుసుకునేందుకు రామన్ పాడు, గోపల్ దిన్నె రిజర్వాయర్లలోని ఇంటెక్ వెల్ లను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డితో కలిసి పరిశీలించారు.
రిజర్వాయర్లలో నీటి మట్టం, ఎన్ని రోజులకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయా? అన్ని ఇంటెక్ వెల్ మోటార్లు నడుస్తున్నాయా? అనే వివరాలను మిషన్ భగీరథ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోపల్ దిన్నె రిజర్వాయర్ వద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వేసవిలో తాగునీటిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఇందులో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లు తాగు నీటిపై క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అత్యవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని సప్లై చేయించేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
వనపర్తి, గద్వాల జిల్లాల్లోని అన్ని రిజర్వాయర్లలో ఆగస్టు వరకు సరిపడా పుష్కలంగా నీళ్లున్నాయని మిషన్ భగీరథ అధికారులు వాటిని క్రమం తప్పకుండా పంపింగ్ చేసి ప్రజలకు సప్లై చేయడంపై దృష్టి సారించాలని ఆదేశించారు. వనపర్తి జిల్లాలోని 392 హాబిటేషన్లు, 5 మున్సిపాలిటీలకు నీటిని అందించాలని, ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరించాలని సూచించారు. తాగు నీటి సప్లైలో ఏ ఒక్క హాబిటేషన్ ఎల్లో, ఆరంజ్, రెడ్ కేటగిరీలో ఉండడానికి వీల్లేదని, అన్ని హాబీటేశన్లు గ్రీన్ కేటగిరీలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రతి ఇంటికి వంద శాతం తాగునీటిని అందించడమే మిషన్ భగీరథ లక్ష్యమని, అందుకు అనుగుణంగా అధికారులు పని చేయాలని ఆదేశించారు. నీటి సరఫరాపై సరైన వివరాలు అందించకపోవడంతో డీపీవో రమణమూర్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సీఈ చెన్నారెడ్డి, మిషన్ భగీరథ ఎస్ఈ జగన్మోహన్, ఈఈ మేఘారెడ్డి, జడ్పీ సీఈవో యాదయ్య, ఇన్చార్జి డీఆర్డీవో నాగేంద్ర, మిషన్ భగీరథ ఏఈలు, ఆఫీసర్లు పాల్గొన్నారు.-
శ్రీశైలం బ్యాక్ వాటర్ పరిశీలన..
కొల్లాపూర్: శ్రీశైలం బ్యాక్ వాటర్ ను సందీప్ కుమార్ సుల్తానియా పరిశీలించారు. మండలంలోని ఎల్లూరు వద్ద రిజర్వాయర్లో నీటి లభ్యతను పరిశీలించారు. అలాగే కోతిగుండం వద్ద నీటి నిలువలను పరిశీలించి నీటి లభ్యత వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి ఇబ్బందులు రాకుండా ప్రణాళికాబద్ధంగా నీటిని ఎత్తిపోయాలని ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీటి సప్లై కీలకమైందని, దీనిని దృష్టిలో పెట్టుకొని తాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.