- పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా
- జీళ్లచెరువు వాటర్ గ్రిడ్‌లో నాలుగు జిల్లాల సమీక్ష
కూసుమంచి, వెలుగు : వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా అధికారులకు సూచించారు. మంగళవారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెరువు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, మిషన్ భగీరథ ఈఎన్సీ జి. కృపాకర్ రెడ్డితో కలిసి ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మిషన్ భగీరథ అధికారులతో తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా కుటుంబాలు, జనాభా, నల్లా కనెక్షన్లు
గ్రిడ్ నుంచి నీటి సరఫరా, రోజువారి నీటి డిమాండ్ తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వచ్చే మూడు నెలలు చాలా కీలకమని, నీటి సరఫరాలో లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవాలని అధికారులకు సూచించారు. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెంలోని 1.35 కోట్ల హాబిటేషన్లకు, 9.44 లక్షల ఇండ్లకు నల్లాకలెక్షన్లు ఉన్నాయని చెప్పారు. జల్ జీవన్ మిషన్ కు సంబంధించి నిధులు వస్తాయని, ఎక్కడైనా తాగునీటి పనులు పెండింగ్‌లో ఉంటే పూర్తిచేయాలని సూచించారు. ప్రభుత్వం నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున ప్రత్యేక నిధులు కేటాయించిందని
అందులో 10 శాతం తాగునీటి కోసం ఖర్చు పెట్టాలని చెప్పారు. మండలానికి ఒక ఏఈ, సమస్యాత్మక మండలాల్లో అవసరమైతే ఇద్దరిని నియమించాలని సూచించారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ మిషన్ భగీరథ ఏఈ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. మిషన్ భగీరథ నుంచి నీటి సరఫరా లేని ప్రాంతాలకు స్థానిక వనరులు, బావులు, బోర్ల ద్వారా నీళ్లు అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, డీపీవో హరికిషన్, మిషన్ భగీరథ సీఈలు కె. శ్రీనివాస్, జి. చెంబాస్, లలిత, ఎస్ఈలు సదాశివకుమార్, రాములు, ఈఈలు వాణిశ్రీ, పుష్పలత, నరేందర్, కృష్ణారెడ్డి, శ్రీనివాస్, వంశీ, అరుణ్ కుమార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.