- తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు చూసుకోవాలి
- రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా
భద్రాద్రికొత్తగూడెం/అశ్వాపురం, వెలుగు: వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా ఆఫీసర్లను ఆదేశించారు. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో సోమవారం ఆయన పర్యటించారు. అశ్వాపురం మండలంలోని కుమ్మరిగూడెం వద్ద మిషన్ భగీరథ ఇన్‌టెక్ వెల్‌ను కలెక్టర్ ప్రియాంక అలతో కలిసి పరిశీలించారు.
గోదావరి నీటి నిల్వల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇన్‌టెక్ వెల్ నుంచి రోజు ఎంత నీటి సరఫరా జరుగుతోందని అడిగారు. రథంగుట్ట వద్ద 40 ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్‌ను పరిశీలించారు. పాములపల్లి, మిట్టగూడెం గ్రామాల మధ్య అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గుత్తికోయల గ్రామాన్ని సందర్శించారు. అనంతరం కలెక్టరేట్ లో పలు శాఖలతో సందీప్ సుల్తానియా రివ్యూ మీటింగ్ నిర్వహించారు. జిల్లాలో నీటి వనరులు ఉన్నాయని తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆఫీసర్లపై ఉందన్నారు.
నీటి వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మిషన్ భగీరథ అధికారులు క్లోరినేషన్ టెస్ట్ లకు సంబంధించి రిజిస్టర్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు. రానున్న రోజుల్లో తాగునీటికి డిమాండ్ పెరుగనున్న క్రమంలో నీటి ఎద్దడి రాకుండా పక్కా ప్రణాళికలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. హ్యాండ్ పంపులు, బోర్లకు ఎప్పటికప్పుడు రిపేర్లు చేస్తూ పర్యవేక్షించాలన్నారు. మీటింగ్‌లో ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ కృష్ణగౌడ్, మిషన్ భగీరథ ఎస్ఈ కృపాకర్ రెడ్డి, సీఈ శ్రీనివాస్, ఈఈ తిరుమలేష్, పబ్లిక్‌హెల్త్ ఈఈ రంజిత్, జడ్పీ సీఈఓ ప్రసూన, భూగర్భ జల శాఖాధికారి బాలుతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
3 నెలలకు సరిపడా నీరు
ఖమ్మం టౌన్: ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్‌తో కలిసి వైరా రిజర్వాయర్ ఇన్‌టెక్ వెల్‌ను సుల్తానియా సందర్శించి, నీటి లభ్యతను పరిశీలించారు. అనంతరం న్యూ కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పాలేరు, వైరా, దుమ్ముగూడెం రిజర్వాయర్ లలో రాబోయే 3 నెలలకు సరిపడా నీరు నిల్వ ఉందన్నారు. పైప్ లైన్ లలో ఎక్కడా లీకేజీలు లేకుండా చూడాలన్నారు. పాలేరుకు నాగార్జున సాగర్ నుంచి 2 టీఎంసీల నీరు వచ్చిందని తెలిపారు. ఈ సమీక్షలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ సహాయ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.