హైదరాబాద్: సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనను సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులకు స్క్రీన్పై చూపిస్తున్నట్లు తెలిసింది. ఒక మహిళ చావుకు, ఆమె కొడుకు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడటానికి కారణమైన ఈ ఘటనను టాలీవుడ్ లైట్ తీసుకుంది. ఈ తొక్కిసలాటకు బాధ్యుడైన అల్లు అర్జున్కు మద్దతుగా నిలిచింది. దీంతో.. తెలంగాణ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక మహిళ చనిపోతే ఆమె కుటుంబానికి కనీస సానుభూతి తెలపడానికి మనసు రాని టాలీవుడ్ ప్రముఖులు అల్లు అర్జున్ను క్యూ కట్టి మరీ పరామర్శించడంపై విమర్శలొచ్చాయి. సంధ్య థియేటర్ దగ్గర ఆ రోజు ఏం జరిగిందో మీరే చూడండని సినీ ప్రముఖులకు కళ్లకు కట్టినట్టు సీఎం రేవంత్ చూపించినట్లు తెలిసింది. పుష్ప-2 సినిమాకు గతంలో మరే సినిమాకు లేనంతగా టికెట్ రేట్లు పెంచుకోవడానికి, బెన్ ఫిట్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం ఇంతగా టాలీవుడ్ కు సహకరించినా ఒక మహిళ చనిపోతే సినీ ఇండస్ట్రీ లైట్ తీసుకోవడంపై ప్రభుత్వం గుర్రుగా ఉంది. సామాన్యుల ప్రాణాలంటే లెక్కలేని విధంగా టాలీవుడ్ ప్రవర్తించడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనను సినీ పెద్దలకు చూపించి.. సీఎం ఈ దుర్ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. టాలీవుడ్ సినీ ప్రముఖుల కళ్లు తెరిపించే ప్రయత్నం చేశారు. టాలీవుడ్ కు, తెలంగాణ ప్రభుత్వానికి దూరం పెరిగిందనే భావనతో సినీ ప్రముఖులు సీఎంను కలిసి తమ వెర్షన్ వినిపించడానికి డిసైడ్ అయ్యారు.
Also Read:-సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ.. హాజరైన సినీ ప్రముఖులు వీరే..
బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ బిల్డింగ్లో సీఎంతో టాలీవుడ్ బడా నిర్మాతలు, దర్శకులు, కొందరు హీరోలు సమావేశమయ్యారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ భేటీలో కీలకంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచినట్లు తెలిసింది. సినిమా టికెట్లపై సెస్ విధించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని టాలీవుడ్ ప్రముఖులకు సీఎం రేవంత్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఆ సెస్ ద్వారా వచ్చిన డబ్బును తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం కోసం ఖర్చు పెట్టే సదుద్దేశంతో ప్రభుత్వం ఉంది.
పుష్ప-2 సినిమాకు ముందు తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్ పట్ల సానుకూలంగానే ఉంది. పుష్ప-2 ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన, శ్రీతేజ్ను టాలీవుడ్ పట్టించుకుకోకపోవడం, అల్లు అర్జున్పై చూపిన శ్రద్ధ రేవతి కుటుంబంపై సినీ పెద్దలు చూపకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. ఇకపై.. టికెట్ రేట్ల పెంపు, బెన్ ఫిట్ షోలు లేవని టాలీవుడ్కు స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సంక్రాంతి సినిమాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉండటంతో టాలీవుడ్ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడాలని నిర్ణయించుకున్నారు.