సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. రేవతి కొడుకు శ్రీతేజ్ పరిస్థితి విషమం

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. రేవతి కొడుకు శ్రీతేజ్ పరిస్థితి విషమం

హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చికిత్స పొందుతున్న బాబు పరిస్థితి విషమంగా ఉంది. అల్లు అర్జున్ అభిమాని శ్రీతేజ్(9) కిమ్స్ హాస్పిటల్లో మృత్యువుతో పోరాడుతున్నాడు. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమె కొడుకే ఈ శ్రీతేజ్. అదే రోజు తల్లితో పాటు తొక్కిసలాటలో చిక్కుకుపోయి శ్రీతేజ్ ఆసుపత్రి పాలయ్యాడు. ఇప్పటివరకు ఈ బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎలాంటి హెల్త్ బులిటెన్ విడుదల చేయకపోవడం గమనార్హం. హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ చైర్మన్ తిరుపతి వర్మ డిమాండ్ చేశారు. 

రేవతి నాలుగో తేదీన చనిపోవడంతో డిసెంబర్14వ తేదీన (శనివారం) పెద్దకర్మ నిర్వహించారు. రేవతి చనిపోవడం, కొడుకు దవాఖానలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో భాస్కర్ ఉన్నాడు.  ఉన్న ఒక్కగానొక్క కూతురును చూసుకుంటూ.. దవాఖానకు వెళ్లి వస్తూ ఇబ్బందులు పడుతున్నాడు. తొమ్మిది రోజులుగా శ్రీ తేజ్ కిమ్స్ దవాఖాలోలో వెంటిలేటర్ పైనే ఉన్నాడు.  ఎప్పుడు స్పృహలోకి వస్తాడోనని కుటుంబ సభ్యులు  ఎదురుచూస్తున్నారు. అతడి లంగ్స్​పని చేయడం లేదని డాక్టర్లు తేల్చారు. ఇన్ని రోజులవుతున్నా కండ్లు తెరిచి చూడకపోవడంతో తండ్రి భాస్కర్ ఆందోళన చెందుతున్నారు.

అసలు ఆ రోజు ఏం జరిగిందంటే..
అల్లు అర్జున్​రాత్రి 9:30 కు సంధ్య థియేటర్కు రాగా.. ఆయన లోపలకు వెళ్లడానికి పోలీసులు, బౌన్సర్లు, పర్సనల్​సెక్యూరిటీ అందరినీ చెదరగొట్టి రూట్​క్లియర్​చేశారు. ఈ క్రమంలో బయటి నుంచి లోపలకు వచ్చేందుకు చాలామంది అభిమానులు దూసుకువచ్చారు. అప్పటికే థియేటర్​లోపల ఒకవైపు భాస్కర్ అతడి కూతురు, మరోవైపు రేవతి, ఈమె కొడుకు శ్రీతేజ్​ ఉన్నారు. బన్నీ​వస్తున్నాడని తెలుసుకుని లోపలున్న అభిమానులంతా తోసుకురాగా వారితో పాటు శ్రీతేజ్ ​కూడా పరిగెత్తాడు. కొడుకును పట్టుకునే క్రమంలో తల్లి రేవతి కూడా వెంట పరుగెత్తింది. దీంతో శ్రీతేజ్​కిందపడగా అభిమానులంతా అతడిని తొక్కుకుంటూ వెళ్లారు.

శ్రీతేజ్ను కాపాడుకునే ప్రయత్నంలో రేవతి కూడా ప్రేక్షకుల కాళ్ల కింద నలిగిపోయింది. మరికొంతమంది కూడా గాయపడ్డారు. ఈ దశలో అక్కడే ఉన్న పోలీసులు.. అరుపులు, కేకలు విని అందరినీ చెదరగొట్టారు. స్పృహ తప్పిన రేవతి, అతడి కొడుకును బయటకు తీసుకువచ్చి సీపీఆర్​ చేశారు. అయినా ప్రయోజనం లేకుండా పోవడంతో రేవతిని డీడీ హాస్పిటల్కు తరలించారు. అక్కడే రేవతి ప్రాణం పోయింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న శ్రీతేజ్ను పోలీసులు హుటాహుటిన కిమ్స్​దవాఖానకు తరలించారు. అప్పటి నుంచి ఆ పిల్లాడికి కిమ్స్లో చికిత్స అందిస్తున్నారు.

రేవతి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్​గ్రేషియా ప్రకటించడంతోపాటు బాబు శ్రీతేజ్​కు వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానని అల్లు అర్జున్ ప్రకటించాడు. ఘటన జరిగి పది రోజులకు పైగానే అయినా ఇప్పటివరకు ఆ డబ్బులను బాధిత కుటుంబ సభ్యులకు అందజేయలేదు. కనీసం వారిని పరామర్శించలేదు. హాస్పిటల్ బిల్స్ మాత్రం అల్లు అర్జున్ కడుతున్నారని రేవతి భర్త భాస్కర్​ చెప్పాడు.