- హైకోర్టులో సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ పిటిషన్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప2 ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సంధ్య థియేటర్ యాజమాన్యం, ఎం.రేణుకాదేవి మరో అయిదుగురు పార్ట్నర్స్ పిటిషన్ దాఖలు చేశారు. నటుడు అల్లు అర్జున్ రాక కారణంగా జరిగిన తొక్కిసలాటలో తన భార్య రేవతి మృతి చెందిందని, కుమారుడు, కుమార్తెలు గాయపడ్డారంటూ ఎం.భాస్కర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
“ప్రీమియర్ షోను థియేటర్ ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వ అనుమతితో మైత్రి డిస్ట్రిబ్యూటర్ ఏర్పాటు చేసింది. బుకింగ్ ఒప్పందంలో భాగంగా డిసెంబర్ 4, 5 వ తేదీల్లో రెండు రోజులు బెనిఫిట్ షోల కోసం డిస్ట్రిబ్యూటర్ నియంత్రణలోనే థియేటర్ ఉంది. ముందు జాగ్రత్తల్లో భాగంగా థియేటర్ వద్ద రద్దీ ఉంటుందని చిక్కడపల్లి ఎస్‌హెచ్‌ఓకు, ట్రాఫిక్ పోలీసులకు థియేటర్ మేనేజ్మెంట్ సమాచారం ఇచ్చింది. అయితే, తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో తొక్కిసలాట జరిగింది. భాస్కర్ ఫిర్యాదులో నిర్ధిష్ట అభియోగాలు లేవు.
పోలీసులు నమోదు చేసిన కేసులోని అభియోగాలు తమకు వర్తించవు. ఫిర్యాదుదారుడు అల్లు అర్జున్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిపైనే ఆరోపణలు చేశారు. థియేటర్ ఆవరణలో ఘటన జరిగిందని చెప్పి తమపై కేసు నమోదు చేయడం అన్యాయం. దీనికితోడు మృతురాలిపై, గాయపడిన వాళ్లపై ఏవిధమైన ఆయుధదాడి గాయాలు లేవు. నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ పోలీసులకు ఆదేశాలివ్వాలి. పిటిషన్‌పై విచారణ పూర్తి అయ్యే వరకు తమను పోలీసులు అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి. థియేటర్ స్టాఫ్‌ను పోలీసులు విచారణ చేయకుండా, కేసు దర్యాప్తును నిలిపివేత ఉత్తర్వులు ఇవ్వాలి.” అని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణ చేయనుంది.