పుష్ప-2 కలెక్షన్లతో ఫుల్ హ్యాపీ మూడ్లో ఉన్న అల్లు అర్జున్కు పెద్ద షాకే ఇది..!

పుష్ప-2 కలెక్షన్లతో ఫుల్ హ్యాపీ మూడ్లో ఉన్న అల్లు అర్జున్కు పెద్ద షాకే ఇది..!

హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో లీగల్ టీంతో సంప్రదించి విచారణ నిమిత్తం హీరో అల్లు అర్జున్ కూడా నోటీసులు ఇస్తామని పోలీసులు చెప్పారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏసీపీ ఎల్ రమేష్ కుమార్ మీడియాకు కీలక వివరాలను వెల్లడించారు. పుష్ప-2 తొక్కిసలాట కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. సంధ్య థియేటర్కు మొత్తం ఏడు మంది యజమానులని, వీరిలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓనర్ సందీప్ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

సీనియర్ మేనేజర్ నాగరాజు, అప్పర్, లోయర్ బాల్కనీ చూసుకునే మేనేజర్ విజయ్ చందర్ని కోర్టులో హాజరు పరచామని, జ్యుడీషియల్ రిమాండ్కు తరలించామని పేర్కొన్నారు. సెక్షన్105, 118(1)r/w3(5) BNS యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయిందని, గాయపడిన ఆమె బాబు పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని ఏసీపీ ఎల్ రమేష్ కుమార్ చెప్పారు. ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్లనే ఇలాంటి ఘటన జరిగిందని ఏసీపీ తెలిపారు.

అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద బుధవారం రాత్రి (డిసెంబర్ 4, 2024) తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. పుష్ప-2 సినిమా ప్రీమియర్ షోకు అభిమానులు భారీగా తరలివెళ్లారు. హీరో అల్లు అర్జున్, శ్రీలీల, మూవీ టీమ్, అల్లు అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితులు పుష్ప-2ను అభిమానులతో కలిసి వీక్షించేందుకు సంధ్య థియేటర్కు వెళ్లారు. అల్లు అర్జున్ వస్తున్నట్లు తెలియడంతో అతనిని చూసేందుకు సంధ్య థియేటర్ వద్దకు అభిమానులు భారీగా తరలివచ్చారు. అల్లు అర్జున్ను దగ్గర నుంచి చూసేందుకు ఎగబడ్డారు. కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. 

ప్రీమియర్ షో చూసేందుకు సంధ్య థియేటర్ వద్దకు వచ్చిన రేవతి(35), ఆమె కొడుకు శ్రీతేజ్ (9) తీవ్రంగా గాయపడ్డారు. బాలుడు స్పృహ కోల్పోవడంతో పోలీసులు సీపీఆర్ చేసి దగ్గర్లోని సికింద్రాబాద్లో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ రేవతి మృతి చెందగా, శ్రీతేజ్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.