
- వచ్చే నెల 1న జరిగే కేసీఆర్సభను సక్సెస్చేయాలి
- ఎంపీలు నామా, బండి, ఎమ్మెల్యే సండ్ర పిలుపు
సత్తుపల్లి/కల్లూరు, వెలుగు: కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక అమలు చేయదని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు. బీఆర్ఎస్ సాధ్యాసాధ్యాలు పరిశీలించాకే హామీలు ఇస్తుందని, తర్వాత అమలు చేసి చూపిస్తుందని చెప్పారు. గురువారం సత్తుపల్లిలో వేంసూరు, సత్తుపల్లి టౌన్, సత్తుపల్లి రూరల్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం, కల్లూరులో తల్లాడ, కల్లూరు, పెనుబల్లి మండలాల నాయకుల సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో ఎంపీలు డాక్టర్ బండి పార్థసారధిరెడ్డి, ఎంపీ నామానాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే సండ్ర నియోజకవర్గంలో రూ.కోట్ల అభివృద్ధి పనులు చేయించారని చెప్పారు. ప్రతిపక్షాలు గుడ్డ కాల్చి మీద వేసేలా అసత్యాలను ప్రచారం చేస్తున్నాయన్నారు. బూత్ లెవల్ లో బీఆర్ఎస్నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అసత్య ప్రచారాలను ధైర్యంగా తిప్పి కొట్టాలన్నారు. హెటిరో డ్రగ్స్ సంస్థ ద్వారా 900 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పారు. నియోజకవర్గ మొత్తానికి దళితబంధు అమలు చేసేలా సీఎం కేసీఆర్ను ఎమ్మెల్యే సండ్ర ఒప్పించారన్నారు.
నాలుగోసారి ఎమ్మెల్యే సండ్రను భారీ మెజార్టీతో గెలిపిస్తే, నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తారని చెప్పారు. నవంబర్1న జరిగే కేసీఆర్ బహిరంగ సభను సక్సెస్చేయాలని పిలుపునిచ్చారు. సమావేశాల్లో ఎంపీపీలు బీరవెల్లి రఘు, లక్కినేని అలేఖ్య, దొడ్డ శ్రీనివాసరావు, జడ్పీటీసీలు కట్ట అజయ్ కుమార్, చక్కిలాల మోహన్ రావు, దిరిశాల ప్రమీల, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, నాయకులు పాలెపు రామారావు, నాయకులు రామారావు, రఫీ, యాగంటి శ్రీనివాసరావు, గాదె నర్సింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, డీసీసీబీ డైరెక్టర్లు చల్లగుండ్ల కృష్ణయ్య, బండి సంజీవరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ వనమ వాసు పాల్గొన్నారు.