సత్తుపల్లి, వెలుగు: ప్రజలు అభివృద్ధికి, సంక్షేమానికి పట్టం కట్టారని, నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దీమా వ్యక్తం చేశారు. శుక్రవారం కౌన్సిలర్ మట్టా ప్రసాద్ నివాసంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మూడోసారి కేసీఆర్ సీఎం అవుతారన్నారు. ఓటు వేసిన వెంటనే ఓటరు నాడి ఎవరికీ తెలియదన్నారు. 30న రాత్రి 11 గంటల వరకు పోలింగ్ జరుగుతుంటే సాయంత్రం 5 గంటలకే సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ కు ఎన్నికల సంఘం ఎలా అనుమతించిందో తెలియటం లేదన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు 30వేల ఓట్లు పోలయ్యాయన్నారు.
ఓటర్లపై ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రభావం ఉంటుందన్నారు. తాను గెలిస్తే సత్తుపల్లి ప్రజలు ఆనందపడతారని భావించి నాయకులు, కార్యకర్తలు తన విజయం కోసం ఎంతగానో శ్రమించారన్నారు. సమావేశంలో జిల్లా లైబ్రరీ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ చైర్మన్ వనమా వాసు, కూసంపూడి రామారావు, రఫీ, శీలపు రెడ్డి హరికృష్ణ రెడ్డి, గొర్ల సంజీవరెడ్డి,మోరంపూడి ప్రసాద్, మోరంపూడి ప్రభాకర్, చెక్కిలాల మోహనరావు తదితరులు పాల్గొన్నారు.