తల్లాడ, వెలుగు : ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి విఫలమైందని, దీంతో సన్న రకం వడ్లు పండించిన రైతులు బోనస్ 500 నష్టపోయారని సత్తుపల్లి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆరోపించారు. ఆదివారం తల్లాడ సొసైటీ ఆఫీస్ ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యంతో సన్న రకాలు పండించిన రైతులు బోనస్ నష్టపోయారని తెలిపారు.
వ్యవసాయ సిబ్బందితో సర్వే చేయించి సన్న రకం పండించిన ప్రతి రైతుకూ బోనస్ అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీసంచుల కొరత, తదితర సమస్యలు పరిష్కరించి రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సీసీఐలో రైతులు తెచ్చిన పత్తి తేమ శాతం పేరుతో వెనక్కు పంపి పరోక్షంగా దళారుల వద్ద కొనుగోలు చేస్తున్నాయని, సీసీఐ కొనుగోలు కేంద్రాలు దళారులకు తప్ప రైతులకు ఉపయోగపడటం లేదని ఆరోపించారు. సీసీఐ సెంటర్లు జిన్నింగ్ మిల్లు వద్ద కాకుండా మార్కెట్ యార్డులో ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ వీరమోహన్ రెడ్డి, దుగ్గిదేవర వెంకట లాల్, కేతినేని చలపతిరావు, బద్దం కోటిరెడ్డి, రుద్రాక్ష బ్రహ్మం, దగ్గుల శ్రీనివాస్ రెడ్డి, దగ్గుల రాజశేఖర్ రెడ్డి, కటికి నరసింహారావు, గుంటిపల్లి వెంకటయ్య, సంఘసాని శ్రీనివాసరావు, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.