సంగం యుగం తమిళ వాజ్ఙ్మయ, సాహిత్యాలకు స్వర్ణయుగంగా చెప్పవచ్చు. తిరుక్కురల్ అనే గ్రంథాన్ని తిరువళ్లువార్ అనే జైనుడు రచించాడు. ఈ గ్రంథం ఆనాటి సమాజంలోని వ్యక్తుల జీవనశైలి, నైతిక ప్రవర్తనను తెలుపుతుంది. అలాగే, సంగం యుగం రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల గురించి వివరిస్తుంది. అగట్టీయాన్ని అగట్టియార్ రచించాడు ఈ గ్రంథం తమిళ గద్యం గురించి వివరిస్తుంది.
సంగం పరిషత్తులు
తమిళ కవుల సమ్మేళనాలను సంగం అని, వారి సాహిత్యాన్ని సంగం సాహిత్యం అని అంటారు. మొదటగా అప్పార్ లేదా తిరునవక్కరసు అనే ఏడో శతాబ్ద కాలంనాటి శైవమతాచార్యులు సంగం అనే పదాన్ని ఉపయోగించారు. ఈ సంగం పరిషత్తులు పాండ్య రాజ్యంలో జరిగాయి. మూడో సంగం పరిషత్తులో అభివృద్ధి చెందిన సాహిత్యాన్ని ఐదు రకాలుగా విభజించవచ్చు. అవి.. తొల్కప్పియం, ఎట్టుతోగయ్, పట్టుపట్టు, పదినెన్ కిల్‌కనక్కు, తమిళ ఇతిహాసాలు రెండు.
తొల్కప్పియం: తమిళ సాహిత్యంలో రచించిన తొలి గ్రంథం. ఈ గ్రంథాన్ని తొల్కప్పియార్రచించాడు. ఈ గ్రంథం తమిళభాష వ్యాకరణం గురించి వివరిస్తుంది.
ఎట్టుతోగయ్: ఎనిమిది సంకలనాలు.
ఉదా: అగన ఊరు, అయింగురునూర్, నర్రినయ్, కురుంతొగై, కలిత్తొగై, పరిపడల్పడిర్రుపట్టు, పురననూరు.
పట్టు పట్టు: పది జానపద గాథలు.
ఉదా: పట్టినప్పలై(కన్నన్), మధురైకంజి (మంగుడి మరుధనార్), తిరుమురుగర్రుపడై, పొరునరర్రుప్పుడై, సిరుపనర్రుపడై, పేరుంపనర్రుపడై, మల్లైపట్టు, నెడునల్వడై, కురింజిప్పట్టు, మలైపడుకదమ్.
పదినెన్ కిల్‌కనక్కు: ఈ గ్రంథం నైతిక విలువలు ఉన్న 18 లఘు రచనలతో కూడింది. ఇందులో ముఖ్యమైన తిరుక్కురల్ను తిరువళ్లువార్ రచించాడు. ఈ గ్రంథంలో రీతిచ ధర్మ సూత్రాలు ఉంటాయి. పదినెన్ కిల్కనక్కును తమిళులు పంచమ వేదంగా పరిగణిస్తారు.
తమిళ ఇతిహాసాలు
శిలప్పాదికారం: ఈ గ్రంథాన్ని చెరన్సెంగుత్తువాన్ సోదరుడు ఇలంగో అడిగల్ రచించాడు. శిలప్పాదికారం అంటే రత్నాల మణిహారం అని అర్థం. ఇందులో కోవలన్, కన్నగి అనే దంపతుల కథని వివరించడమైంది. భర్త కోసం కన్నగి పడిన తాపత్రయాన్ని వివరించాడు. తమిళ ప్రజలకు ఇప్పటికీ కన్నగిని ఒక పాతివ్రత్య దేవతగా ఆలయాలను నిర్మించి పూజిస్తున్నారు.
మణిమేఖలై: మణిమేఖలై అంటే వడ్డాణం అని అర్థం. ఈ గ్రంథంలో కావేరి పట్టణానికి చెందిన కోవలన్, మాధవి దంపతుల కుమార్తె మణిమేఖలై అనే నాట్యకారిణి గాథను వివరించారు. ఈమె చివరికి బౌద్ధ బిక్కునిగా మారుతుంది. ఈ గ్రంథ రచయిత సిత్తలై సత్తనార్. ఇది సంగం యుగం నాటి లలిత కళలు, సంస్కృత భాష ప్రభావం గురించి తెలుపుతుంది. ఈ గ్రంథం బౌద్ధ శిలప్పాదికారానికి బౌద్ధ అనుబంధం. ఇందులో సరస్వతి దేవి ప్రస్తావన ఉంది.