తెలంగాణ వైతాళికుడు సంగంరెడ్డి సత్యనారాయణ

తెలంగాణ వైతాళికుడు సంగంరెడ్డి సత్యనారాయణ

తెలంగాణ వైతాళికుల్లో ఒకరైన సంగంరెడ్డి సత్యనారాయణ తన స్వగ్రామమైన ముచ్చర్ల పేరుతోనే ప్రాచుర్యం పొందడం విదితమే. తన పేరుకు ఊరును జోడించడం ఆయనకూ ఆనందమేనేమో.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎర్రగా ఉదయించి, మలి ఉద్యమ దశదాకా తాను అస్తమిస్తూ కూడా అంతే దేదీప్యమానంగా వెలిగిన తీరులోనే ఆయన పోరాట తత్వం దాగి ఉంది.  

తెలంగాణలో ప్రజాపాలన రావాలన్న ఆయన కలలను నెమరేసుకుంటూ జనవరి 21, 2025న  రవీంద్రభారతిలో ముచ్చర్ల సత్యనారాయణ 92వ జయంతిని జరుపుకుంటున్నాం. ఇదే జనవరి మాసంలోనే నిఖార్సయిన తెలంగాణ ఉద్యమకారులైన ప్రొఫెసర్‌‌ కేశవరావు జాదవ్‌‌, సంగం రెడ్డి సత్యనారాయణల ఇరువురి 92వ జయంతి జరుపుకోవడం యాదృచ్భికమైనా, ఒక విశిష్టతగానే మనం భావించవచ్చు.  

ముచ్చర్ల సత్యనారాయణలోని బహుజన తత్వం, అంతర్గత జీవన తత్వంగా ఎలా పెరిగి పెద్దయ్యిందో  తెలుసుకోవడానికి ఇంతకంటే మంచి సందర్భం మరొకటి ఉండదు. దాన్ని గుర్తించి ఆచరించడమే ఆయనకు నిజమైన నివాళి.  పోరాటాల ఖిల్లాగా ప్రఖ్యాతి పొందిన వరంగల్‌‌ జిల్లాలోని ముచ్చర్ల గ్రామంలో ఓ యాదవ కుటుంబంలో 1933 జనవరి 1 తేదీన సంగంరెడ్డి నరసయ్య-, నరసమ్మ దంపతులకు ఏడుగురు సంతానంలో చివరివాడిగా సంగంరెడ్డి సత్యనారాయణ జన్మించారు.  

ఉద్యమ ధీరోదాత్తుడు

పేదరికం వెంటాడుతున్నా నిరంతరం సాగే ఆటపాటలతో చదువుతోపాటు తన వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుకున్నాడు.  నిజాం వ్యతిరేక రైతాంగ పోరాట ప్రభంజనాన్ని, కమ్యూనిస్టు పార్టీ ప్రభావాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా చూస్తూ వడిసెల దళాలలో, గుతుపల దండులో భాగమవుతూ ఆయన యవ్వనమంతా సాగింది.  సమాజ అస్తిత్వమే మనిషి చైతన్యాన్ని నిర్ణయిస్తుందన్న మహోపాధ్యాయులు కారల్‌‌ మార్క్స్‌‌ మాటలు ముచ్చర్ల సత్యనారాయణ విషయంలో అక్షర సత్యాలు.  మూడు చెరువులు, 80 కుంటలుగా విలసిల్లిన గ్రామంలో జీవిత పర్యంతం వ్యవసాయంతో ముడివేసుకున్న అనుభవం నుంచి ఆయనలో నిజమైన రైతాంగ నేత,  నిరంతర శ్రమజీవి మొగ్గ తొడిగాడు. 

అనాటి గ్రామీణ సంఘ జీవితంలో జానపద  కళారూపాల్లోని భజనలు,  బాగోతాలు,  చిరుతల రామాయణాల నుంచి ఒక వాగ్గేయకారుడు ఉద్భవించి తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమ ప్రారంభంలోనే ‘సంజీవరెడ్డి మామ’ అంటూ ఎన్నో పాటలు పాడుతూ ప్రజలను ఊర్రూతలూగించాడు. ఆధిపత్యవాద దోపిడీదారుల చేతుల్లో న్యాయం తల్లడిల్లినప్పుడు, నిరుపేదలకు న్యాయం దక్కడానికి, తన న్యాయవాద వృత్తి సర్వస్వాన్ని ధారబోసి ప్రజల పక్షాన నిలబడ్డాడు.  

సత్తన్న జీవితాన్ని పాఠ్యాంశంగా ప్రజలకందించాలిచీడలు, పీడలను ఎదిరించి పంటలు దక్కించుకునే ఒక రైతన్నతో పాటు, ఆయనలో అంతర్లీనంగా దాగివున్న తత్వమే బహుజన తాత్వికత. బహుజన నాయకత్వ పటిమకు దొరికిన ప్రతి నిచ్చెన మెట్టును ఎక్కుతూ ఎమ్మెల్యేగానే గాకుండా  కేబినెట్‌‌ హోదా కలిగిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగానూ ఎదిగాడు.  బీసీల రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నవాళ్లు ముచ్చర్ల సత్యనారాయణ జీవిత పాఠాన్ని అధ్యయనాంశంగా స్వీకరించాలని నా అభిప్రాయం.  

తెలంగాణ ఉద్యమంలో డా. పృథ్వీరాజ్‌‌తో  పరిచయమైన ముచ్చర్ల సత్యనారాయణ మా తండ్రి బండ్రు నర్సింహులులాగానే నన్ను,  నా మార్గాన్ని నిరంతరం ప్రోత్సహించేవాడు. వందేళ్ళ కమ్యూనిస్టు ఉద్యమం తనను తాను తరిచి చూసుకుంటున్న సమయంలో  ప్రజల మనుషులుగా  జీవించిన ముచ్చర్ల సత్యనారాయణ లాంటి వారిపై ఒక అంచనాకు రావాల్సి ఉంటుంది. 

తమది ప్రజాపాలనగా చెప్పుకుంటున్న కాంగ్రెస్‌‌ పాలకులు తన జీవితంలో సింహభాగం తెలంగాణ కోసం అంకితం చేసిన బహుజన హితవాది, ప్రజా వైతాళికుడు ముచ్చర్ల సత్తన్న జీవిత సారాన్నిపాఠ్యాంశంగా  ప్రజలకందించాలి. వారి స్మృతులను చిరస్మరణీయం చేయడానికి పూనుకోవాలి. 92వ జయంతి సందర్భంగా ప్రజల మనిషి ముచ్చర్ల సత్యనారాయణకు హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నాను.

- విమలక్క,టీయూఎఫ్ అధ్యక్షురాలు-