సంగంబండ కెనాల్కు అడ్డంగా బండరాయి

సంగంబండ కెనాల్కు అడ్డంగా బండరాయి

మక్తల్, వెలుగు: సాగునీటి కాలువకు అడ్డం వచ్చిన బండను తొలగించకపోవడంతో రెండున్నర ఏండ్లుగా 6 వేల ఎకరాలు బీళ్లుగా మారాయి. బండను తొలగించేందుకు ప్రభుత్వం అప్పట్లోనే రూ.2 కోట్లు కేటాయించింది. కానీ నిర్వాసితులకు అందాల్సిన రూ.13 కోట్ల పరిహారం ఇవ్వకపోవడంతో బండ తొలగింపు పనులకు   వారు అడ్డుపడుతున్నారు. పరిహారం చెల్లింపుల్లో సర్కారు నిర్లక్ష్యంతో నిర్వాసితులు అవస్థలు పడుతుండగా.. 6 వేల ఎకరాలకు నీరందక ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం సంగంబండ ప్రాజెక్టు ద్వారా సంగంబండ, గుర్లపల్లి, వనాయికుంట,  తిర్మలాపురం, దాసర్ దొడ్డి,  ఓబుళాపురం, వడ్వాట్ గ్రామాల్లోని సుమారు 6 వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు లో లెవెల్ కెనాల్ నిర్మాణం చేపట్టారు. ఈ కాల్వ తవ్వుతుండగా 400 మీటర్ల  బండ అడ్డం వచ్చింది. బండను తొలగించడానికి రెండేండ్లుగా అడ్డంకులు తొలగడంలేదు. 

పాడుబడిన ఇండ్లలోనే..

నారాయణపేట జిల్లా మక్తల్ మండలం సంగంబండ గ్రామం ప్రాజెక్ట్​కింద పూర్తిగా మునిగిపోగా, ఆ గ్రామస్తుల కోసం ఊరి సమీపంలోని 68 ఎకరాల్లో 2003 నవంబర్ 21న పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. 68 ఎకరాల్లో 10 ఎకరాలు లెఫ్ట్ కెనాల్ కోసం వాడుకోవడంతో మిగిలిన 58 ఎకరాల్లోనే గ్రామస్తులకు ఇండ్ల జాగాలు కేటాయించారు. అయితే అందరికీ జాగాలు సరిపోలేదు. ఇండ్లు కోల్పోయిన వారిలో 80 మందికి ఒక్కొక్కరికీ  రూ.78వేలు ఇచ్చారు. ఈ అమౌంట్​కొత్త ఇంటి నిర్మాణానికి సరిపోలేదు. మిగిలిన 150 కుటుంబాలకు ఉపాధిహామీ కింద పనులు కల్పించారు. దాదాపు ఏడాది కాలానికి గాను వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.13 కోట్లు అందలేదు. దీంతో చాలామంది  పాత ఊరిలో పాడుపడిన ఇళ్లలోనే ఉంటున్నారు. ముంపునకు గురైనవారికి కొత్త  ఇండ్లు కట్టుకునేందుకు డబ్బులు రాకపోవడం, పునరావాస నిధులు అందకపోవడంతో పాత, పైకప్పులు లేని ఇండ్లలోనే కాలం గడుపుతున్నారు. పునరావాసానికి సంబంధించిన డబ్బులు వెంటనే ఇవ్వాలని, తమకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించాని గ్రామస్తులు కోరుతున్నారు.  

సాగునీరు అందించండి

సంగంబండ రిజర్వాయర్ నుంచి మా పొలాలకు సాగునీరు వస్తుందని దాదాపు 100 ఎకరాల వరకు భూములు ఇచ్చాం. బండ అడ్డం వచ్చి మా పొలాలకు సాగునీరు అందడం లేదు. అధికారులు బండను తొలగించడానికి చొరవ తీసుకోవాలి.
– రవీందర్, రైతు, వడ్వట్, మాగనూర్​మండలం

త్వరలోనే తొలగిస్తాం

సంగంబండ ప్రాజెక్టు లో లెవల్ కెనాల్​కు అడ్డుగా వచ్చిన 400 మీటర్ల బండను తొలగించేందుకు  ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసింది. తొందరలో బండను తొలగిస్తాం. కెనాల్ పనులు 80 శాతం పూర్తయ్యాయి.  బండ తొలగింపును నిర్వాసితులు అడ్డుకుంటున్నారు. తమకు రావాల్సిన  రూ.13 కోట్లు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయం కలెక్టర్ దృష్టిలో ఉంది. 
-  బలరాం, ఏఈఈ, సంగంబండ ప్రాజెక్టు


డబుల్​ బెడ్ ​రూమ్ ​ఇండ్లివ్వాలి

సంగంబండ నిర్వాసితులకు బకాయి పడిన  రూ.13 కోట్లు వెంటనే చెల్లించాలి.  గతంలో సర్వే చేసి గుర్తించినవారికి ఇండ్ల నిర్మాణానికి కేటాయించిన డబ్బులు సరిపోవడం లేదు. వారందరికీ డబుల్ బెడ్​రూమ్​ఇండ్ల స్కీం వర్తింపజేయాలి.
-– బలరాంరెడ్డి, ఎంపీటీసీ, కాచ్వార్

బండను వెంటనే తొలగించాలి

సంగంబండ ప్రాజెక్టు లో లెవల్ కెనాల్​కు అడ్డుగా ఉన్న బండరాయిని వెంటనే తీయాలి. నీళ్లొస్తే పంటలు పండుతాయని సంతోషంగా భూమిని కెనాల్ కోసం ఇచ్చిన. భూములిచ్చి ఏండ్లు గడిచినా సాగునీరు అందడం లేదు.  
– శ్రీపాద, రైతు, వడ్వట్