
సంగారెడ్డి టౌన్, వెలుగు: శివరాత్రి సందర్భంగా నాలుగు రోజుల పాటు నిర్వహించే ఝరాసంఘం కేతకీ సంగమేశ్వర స్వామి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ క్రాంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సంగారెడ్డి కలెక్టర్ ఆఫీసులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ.. జాతరకు తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలన్నారు.
ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడపాలని సూచించారు. జాతరకు వచ్చే మార్గాల్లో రోడ్ల రిపేర్పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలని సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్, డీఆర్వో పద్మజారాణి, డీపీవో సాయిబాబా, ఆర్డీవో రాంరెడ్డి, టెంపుల్ ఈవో శివ రుద్రప్ప, ఆయా మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.
కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ క్రాంతి అధికారులకు సూచించారు. కలెక్టరేట్ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి సదుపాయాలను సరిచూసుకోవాలన్నారు. పోలింగ్ ఏర్పాట్లపై రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు సమాచారం అందించాలన్నారు.
పోలింగ్ సిబ్బందికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని, పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్స్ లను భద్రత మధ్య కరీంనగర్లోని రిసెప్షన్ సెంటర్కు తరలించాలన్నారు. ఓటింగ్ పూర్తి పారదర్శకంగా జరిగే విధంగా విధులు నిర్వహించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్ వో పద్మజారాణి, జడ్పీ సీఈవో జానకి రెడ్డి, సీపీవో బాలశౌరి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.