సంగమేశ్వరం స్టార్టయింది.. మన బ్యారేజీ ఏమైంది సారూ?

కృష్ణా నదిపై పెద్దమారూరు దగ్గర బ్యారేజీ నిర్మిస్తామని అప్పట్లో ప్రకటన
సంగమేశ్వరం ఆపకుంటే శ్రీశైలానికే నీళ్లు రానివ్వబోమన్న కేసీఆర్‌
లైట్‌ తీసుకున్న ఏపీ సీఎం జగన్‌.. స్పీడ్‌గా సంగమేశ్వరం పనులు

హైదరాబాద్‌, వెలుగు: ఏపీ సర్కారు పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం ప్రాజెక్టులు ఆపకుంటే.. అసలు శ్రీశైలం రిజర్వాయర్లోకే నీళ్లు రానియ్యమని అప్పట్లో హెచ్చరించిన సీఎం కేసీఆర్‌ ఇప్పుడా మాటనే మర్చిపోయారు. శ్రీరాం సాగర్‌ లోకి నీళ్లు రాకుండా మహారాష్ట్ర బాబ్లీ కట్టినట్టుగా.. శ్రీశైలంలోకి నీళ్లు రాకుండా ఆలంపూర్‌ పెద్దమారూరు దగ్గర బ్యారేజీ నిర్మిస్తామన్న ప్రతిజ్ఞను పక్కన పెట్టేశారు. అపెక్స్ మీటింగ్ లో గట్టిగా మాట్లాడటం మినహా పెద్దమరూర్‌ బ్యారేజీ నిర్మాణానికి కనీస ప్రయత్నం చెయ్యలేదు. అటు కేసీఆర్‌ హెచ్చరికను లైట్‌ తీసుకున్న ఏపీ సీఎం జగన్‌.. సంగమేశ్వరం పనులను షురూ చేసుడే కాదు, పరుగులు పెట్టిస్తున్నరు. ఇట్లా ఏపీ ఏకపక్షంగా పనులు చేసుకుపోతున్నా రాష్ట్ర సర్కారు కనీసం కంప్లైంట్​ కూడా చెయ్యడం లేదు.

మొదట్నుంచీ సైలెంట్!
ఏపీ సర్కారు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ కెపాసిటీని డబుల్ చేయడంతోపాటు సంగమేశ్వరం దగ్గర రోజుకు మూడు టీఎంసీల చొప్పున నీళ్లు
ఎత్తిపోసేలా కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి ఈ ఏడాది మే 5న ఉత్తర్వులు జారీ చేసింది. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చేలా, కృష్ణానది
నీళ్లన్నింటినీ మళ్లించుకుపోయేలా ఏపీ కుట్ర పన్నుతున్నా.. అప్పట్లో సీఎం కేసీఆర్‌‌ సైలెంట్ గా ఉన్నారు. కానీ ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, రైతులు ఆందోళనలకు దిగడంతో.. ఒత్తిడి పెరిగి నింపాదిగా ఏపీ ప్రాజెక్టులపై కృష్ణాబోర్డుకు కంప్లైంట్ చేశారు. తర్వాత ఆ ప్రాజెక్టులను ఆపేందుకు పెద్దగా ప్రయత్నాలేవీ చెయ్యలేదు. దీంతో ఏపీ అక్రమ ప్రాజెక్టులకు సీఎం కేసీఆర్ సహకరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. అపెక్స్​ మీటింగ్​లో ఎక్కువే మాట్లాడి .. అక్టోబర్‌‌ 6న కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన నిర్వహించిన రెండో అపెక్స్‌‌ కౌన్సి ల్‌ మీటింగ్​లో ఎక్కువసేపు సీఎం కేసీఆరే మాట్లాడారు. నీళ్ల విషయంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని చెప్పారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులను ఆపాల్సిందేనని, కృష్ణా బేసిన్‌ అవసరాలు తీరకుండా పెన్నా బేసిన్‌ కు నీళ్లు తరలిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌‌ విస్తరణ, సంగమేశ్వరం లిఫ్ట్‌‌ స్కీంలను ఆపకుంటే.. అసలు శ్రీశైలం రిజర్వాయర్‌‌లోకే నీళ్లు రానివ్వబోమని, అలంపూర్‌‌కు సమీపంలోని పెద్దమరూర్‌‌ వద్ద కృష్ణా నదిపై బ్యారేజీ నిర్మిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఈ మాటే మరిచిపోయారు.

70 రోజులు దాటింది.. సర్వే కూడా చెయ్యలే..
అపెక్స్‌‌ మీటింగ్​ జరిగి 70 రోజులు దాటినా ఇప్పటివరకు పెద్దమరూరు దగ్గర బ్యారేజీ నిర్మాణానికి ఏ ప్రయత్నాలు చేయలేదు. సర్వే చేయించే దిశగా అయినా ఆదేశాలు ఇవ్వలేదు. అపెక్స్‌‌ మీటింగ్​లో కేసీఆర్‌‌ నోటిమాటగా చెప్పడమే తప్ప.. బ్యారేజీ నిర్మాణానికి ఆ ప్రాంతం అనువుగా ఉంటుందా లేదా, ఒకవేళ కడితే ఎంత ఖర్చవుతుందనే పరిశీలన కూడా చేయలేదు.

అప్పటికప్పుడు ప్రస్తావించి ..
హైదరాబాద్‌, కర్నూల్‌ హైవేపై బీచుపల్లి కృష్ణా బ్రిడ్జికి సుమారు 30 కిలోమీటర్ల దిగువన పెద్దమరూరు ఉంటుంది. అప్పట్లో పాలమూరు– రంగారెడ్డి నీటి సోర్స్​ను జూరాల నుంచి మరో చోటుకి మార్చాలన్న సీఎం ఆదేశాలతో 2014–15లో రిటైర్డ్‌‌ ఇంజనీర్లు సర్వే చేశారు. బీచుపల్లి నుంచి సోమశిల వరకు 10 చోట్ల బ్యారేజీలు కట్టి, నీళ్లను లిఫ్ట్​ చెయ్యాలని సర్కారుకు సూచించారు. కానీ అది వయబుల్‌ కాదని శ్రీశైలం ప్రాజెక్టు ఫోర్‌‌ షోర్‌‌ లోని ఎల్లూరుకు సోర్సును మార్చారు. అయితే రిటైర్డ్‌‌ ఇంజనీర్లు సూచించిన పది బ్యారేజీలకు సంబంధించి పూర్తిస్థాయిలో సర్వే ఏదీ చెయ్యలేదు. ఎక్కడ, ఎంత పొడవైన బ్యారేజీ కట్టాల్సి ఉంటుందో పేర్కొనలేదు. కానీ వాళ్లు చేసిన ప్రతిపాదనల్లో పెద్దమరూర్‌‌ బ్యారేజీ పేరు కూడా ఉండటంతో.. సీఎం కేసీఆర్ అదే విషయాన్ని అపెక్స్‌‌ మీటింగ్​లోనూ ప్రస్తావించారు.

కంప్లైంట్‌‌ కూడా చెయ్యలే..
సంగమేశ్వరం లిఫ్ట్‌‌ స్కీం పనులను ఏపీ మొదలుపెట్టేసినా .. రాష్ట్ర సర్కారు ఇప్పటివరకు కంప్లైంట్‌‌ కూడా చేయలేదు. కేంద్ర ఆదేశాలను ఉల్లంఘించి మరీ ఏపీ సర్కారు వ్యవహరిస్తోందన్న విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖ, సీడబ్ల్యూసీల దృష్టికి తీసుకెళ్లలేదు. సంగమేశ్వరం, పోతిరెడ్డిపాడు విస్తరణ అంశాల్లో రాష్ట్ర సర్కారు మాటలు చెప్పడమే తప్ప ఏం చేయడం లేదన్న విమర్శలు వస్తున్నయి.

గట్టిగా బెదిరించినట్టు చేసి..
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌‌ బీచుపల్లి బ్రిడ్జి వరకు ఆగుతాయి. అలంపూర్‌‌ నుంచి వచ్చే తుంగభద్ర సోమశిల వద్ద కృష్ణాలో కలుస్తుంది. రెండు నదుల నీళ్లు కలిసి పెద్దమరూరు దగ్గర ఎక్కువ మొత్తంలోనే నిల్వ ఉంటాయి. ఇక్కడ ఎండాకాలంలో తప్ప మిగతా రోజుల్లో నిర్మాణాలు చేయడం సాధ్యం కాదు. ఒకవేళ పెద్దమరూరు దగ్గర బ్యారేజీ కడితే.. అక్కడి నుంచి జూరాల క్రస్ట్‌‌ గేట్ల దాకా కృష్ణా నదిలో నీళ్లు నిల్వ ఉండే చాన్స్​ ఉంటుంది. రెండు కిలోమీటర్ల పొడవుతో కట్టే ఈ బ్యారేజీతో 20 టీఎంసీలకుపైగా నీటిని నిల్వ చేయవచ్చు. కానీ శ్రీశైలం బ్యాక్​ వాటర్ లో ఇంత భారీ బ్యారేజీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం అంత సులువుకాదని ఎక్స్​పర్టులు చెప్తున్నారు. కానీ ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండానే.. సీఎం కేసీఆర్ అపెక్స్‌‌ కౌన్సిల్‌ లో నోటి మాటగా బ్యారేజీ నిర్మిస్తామని ప్రకటించారు. మరి ఇప్పుడు ఏపీ సంగమేశ్వరం పనులు మొదలుపెట్టేసినా చూస్తూ ఊరుకోవడం తప్ప కేసీఆర్‌‌ ఏమీ చేయడం లేదు.

For More News..

డాక్టర్ స్లిప్ ఉంటే టెస్టులన్నీ ఫ్రీ