పథకాల అమలుకు సర్వే షురూ : కలెక్టర్​ క్రాంతి

పథకాల అమలుకు సర్వే షురూ : కలెక్టర్​ క్రాంతి
  • సంగారెడ్డి జిల్లాలో ప్రత్యేక అధికారి హరిచందనతో కలిసి
  • సర్వే తీరును పరిశీలించిన కలెక్టర్​ క్రాంతి
  • మెదక్​ జిల్లా రామాయంపేటలో పర్యటించిన కలెక్టర్  రాహుల్​రాజ్

సంగారెడ్డి టౌన్, సదాశివపేట, వెలుగు: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని సీనియర్ ఐఏఎస్, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి హరిచందన అన్నారు. గురువారం కలెక్టర్ క్రాంతితో కలిసి కంది మండలం,చిమ్మాపూర్, సంగారెడ్డి పట్టణంలోని బృందావన్ కాలనీలో జరుగుతున్న సర్వే తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొదటి విడతలో ఇండ్లు లేని నిరుపేదలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

ఈనెల 16 నుంచి 20 వరకు సర్వే చేసి 21 నుంచి 24వరకు గ్రామసభలు నిర్వహించి అర్హుల జాబితాను సిద్ధం చేస్తామని వెల్లడించారు.  సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. డేటా ఎంట్రీ సమయంలో ఎలాంటి తప్పులు చేయవద్దన్నారు. అర్హుల జాబితాల తయారీలో ఏవైనా సందేహాలు ఉంటే అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్న బృందాలకు సూచించారు. 

ALSO READ | ఆదివాసీ ఫ్రెండ్లీ పోలీస్.. జైనూర్​ ఇష్యూ తర్వాత మారిన పంథా

 కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ..  ప్రతీ మండలంలోని అన్ని జీపీల పరిధిలో ఫీల్డ్ వెరిఫికేషన్ వేగంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.  ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరిస్తూ సమగ్ర వివరాలను సేకరించాలన్నారు. ఆధార్ కార్డు, ప్రజాపాలన దరఖాస్తులు, సామాజిక ఆర్థిక సర్వే వివరాలతో సరిచూసుకోవాలన్నారు. డిజిటల్ సంతకం ఉన్న పట్టా పాస్ బుక్కుదారులు పంటలు సాగు చేస్తున్నారా లేదా అన్నది పరిశీలన చేయాలన్నారు. 

వ్యాపార, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న భూముల గురించి పూర్తి వివరాలను నమోదు చేయాలన్నారు. వాటిని సంబంధిత పోర్టల్ లో అప్​లోడ్​చేయాలని సూచించారు. రేషన్ కార్డుల్లో పేర్ల తొలగింపుతో పాటు కొత్త పేర్లను చేర్చడం వంటివి చేయాల్సి ఉన్నందున దరఖాస్తుదారుడి కుటుంబంలోని సభ్యులందరి వివరాలను సేకరించాలన్నారు. ఫీల్డ్ వెరిఫికేషన్ కు వెళ్లడానికి ముందే ఆయా గ్రామాల్లో చాటింపు ద్వారా ప్రజలకు ముందస్తు సమాచారం తెలియజేయాలన్నారు.

పరిశీలన బృందాల పనితీరును తహసీల్దార్లు, ఆర్డీవోలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సదాశివపేట మండల పరిధిలోని ఆరు గ్రామంలో నిర్వహిస్తున్న సర్వే వివరాలను కలెక్టర్ పరిశీలించారు. అధికారులు చేస్తున్న సర్వేను పరిశీలించి దరఖాస్తుదారులతో నేరుగా మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్డీవో రవీందర్ రెడ్డి, ఎంపీడీవోలు శ్రీనివాస్, లక్ష్మి,  తహసీల్దార్లు విజయలక్ష్మి , సరస్వతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

రామాయంపేట మున్సిపాలిటీ, కాట్రియాలలో కలెక్టర్ ​పరిశీలన 

రామాయంపేట: రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్​కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక సర్వే ప్రారంభమైనట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం ఆయన రామాయంపేట మున్సిపాలిటీ, మండల పరిధిలోని కాట్రియాల గ్రామంలో పర్యటించి సర్వే తీరును పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి నిరుపేదకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే దిశగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందన్నారు.

లబ్ధిదారుల ముసాయిదా జాబితా తయారీకి,  నిరుపేదల గుర్తింపునకు సర్వే పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా పర్యవేక్షణకు అన్ని మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించగా, విచారణ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వివరాలను సేకరిస్తున్నాయని వివరించారు. కలెక్టర్ వెంట రామాయంపేట ప్రత్యేక అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ రజని పాల్గొన్నారు.