రామచంద్రాపురం, వెలుగు : చెరువులు, కుంటల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి పేర్కొన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మూడు ప్రధాన చెరువుల అభివృద్ధి, పరిరక్షణ, నీటి నిల్వ సామర్థ్యాలు పెంచే అంశాలపై శుక్రవారం వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ తెల్లాపూర్‌లోని చెరువుల పరిస్థితులు, వాటి పరిమాణం, ప్రస్తుత స్థితిలపై వెంటనే డిజిటల్ మ్యాప్స్, సర్వే డేటాతో నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
హెచ్ఎండీఏ పరిధిలోని భవనాల పర్మిషన్లు జాగ్రత్తగా పరిశీలించాలని, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఆక్రమించి నిర్మాణాలు చేస్తే తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో చెరువుల పరిస్థితిని పోల్చి ఎఫ్టీఎల్, బఫర్ పరిమితులను గుర్తించాలని, వెంటనే వాటికి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. హెచ్ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు కలసి సమన్వయంతో పనిచేసి చెరువులను కాపాడే బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
సమావేశంలో అడిషినల్ కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, ఇరిగేషన్ ఈఈ జయభీమ్, ఆర్డీవో రవీందర్ రెడ్డి, తహసీల్దార్ సంగ్రామ్‌రెడ్డి, సర్వేయర్ రాంభద్ర, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.