
సంగారెడ్డి టౌన్, వెలుగు: అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 18 నుంచి 21 వరకు లబ్ధిదారులను గుర్తించాలన్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ, మండల ప్రత్యేక అధికారులు సమన్వయంతో పనిచేసి లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన గ్రామాలు కాకుండా జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారుల గుర్తింపు పూర్తిచేయాలన్నారు. ఈనెల 17 నుంచి ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్న వారి లిస్టును అధికారులకు అందిస్తామన్నారు.
లబ్ధిదారులకు లిస్టును మే 2న ప్రకటిస్తామన్నారు. నియోజవర్గానికి 3500 ఇండ్లతో పాటు జనాభా ప్రాతిపాదికన 20 శాతం అదనంగా కేటాయించిందన్నారు.వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ చంద్రశేఖర్, జడ్పీ సీఈవో జానకి రెడ్డి, డీపీవో సాయిబాబా, హౌసింగ్ పీడీ చలపతిరావు, అడిషనల్ డీఆర్డీవో బాలరాజు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
భూ భారతిని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లాలి
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని కలెక్టర్ క్రాంతి రెవెన్యూ అధికారులకు సూచించారు. ఈ నెల 16న రెవెన్యూ అధికారులకు శిక్షణ, 17 నుంచి 30 వరకు మండలాల వారీగా రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. అనంతరం భూభారతి పోర్టల్ ను ఓపెన్ చేసి పరిశీలించారు. రైతులు ఆఫీసులు, అధికారుల చుట్టూ తిరగకుండా భూభారతిని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. రైతులు అవగాహన కార్యక్రమాలను సక్సెస్చేయాలని పిలుపునిచ్చారు.
సహకార సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి
జిల్లాలో ఉన్న ప్రాథమిక, మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ క్రాంతి అధికారుల ఆదేశించారు. జిల్లాలో మొత్తం 34 సంఘాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు. వాటిలో 11 మత్స్య పారిశ్రామిక సంఘాలకు బ్యాలెట్ బాక్స్ ద్వారా, 23 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు హ్యాండ్ రైజింగ్ ద్వారా అధ్యక్షులను ఎన్నుకుంటారన్నారు. పోలింగ్ కేంద్రాలఏర్పాటుకు కోసం రెవెన్యూ అధికారులకు తగు సూచనలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యేలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.