
సంగారెడ్డి, వెలుగు: జిల్లాలో లేఔట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కోసం దరఖాస్తు చేసుకున్నవారు పూర్తి స్థాయి ఫీజు చెల్లించి ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని కలెక్టర్ క్రాంతి తెలిపారు. రెవెన్యూ, మునిసిపల్, పంచాయతీ రాజ్ అధికారులతో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మంగళవారం ఒక్కరోజే జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో 76, రూరల్ ఏరియాలో 116 ఎల్ఆర్ఎస్ ఈ పేమెంట్ జరిగాయన్నారు.
ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులకు రిబేటును మినహాయిస్తూ ల్యాండ్ రెగ్యులరైజెషన్ కు సంబంధించిన ప్రొసీడింగ్ లు జారీ చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ప్రతి మండల ఆఫీసులో ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ నెల 31 లోపు పూర్తి స్థాయి ఫీజు చెల్లించే వారికి ప్రభుత్వం 25 శాతం రిబేటు ఇస్తున్న విషయాన్ని ప్రచారం చేయాలని ఆదేశించారు. ఈ టెలీకాన్ఫరెన్స్ లో ట్రైనీ కలెక్టర్ మనోజ్, ఆర్డీవోలు, మునిసిపల్ కమిషనర్లు, పంచాయతీ రాజ్ అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ జోక్యంతో ముగిసిన వివాదం
జిల్లాలోని సదాశివపేటలో గల ఎంఆర్ఎఫ్ కంపెనీ యాజమాన్యం, అందులో పనిచేస్తున్న ట్రైనీ కార్మికుల మధ్య తలెత్తిన వివాదం కలెక్టర్ క్రాంతి జోక్యంతో ముగిసింది. సోమవారం రాత్రి జరిగిన చర్చల్లో ట్రైనీ కార్మికులు కంపెనీలో పనిచేయదలుచుకుంటే కాంట్రాక్ట్ కార్మికులుగా తీసుకోవడానికి కంపెనీ యాజమాన్యం అంగీకరించింది.
వారి పనితీరును బట్టి వేతనం రూ18 వేల నుంచి రూ.24 వేల వరకు ఇవ్వడానికి ఒప్పుకుంది. కాంట్రాక్టు కార్మికులుగా 10 ఏళ్లకు పైగా పనిచేసిన కార్మికులకు గతంలో యాజమాన్యం ఇచ్చిన హామీ మేరకు గ్రాట్యూటీ డబ్బులు చెల్లించాలని కలెక్టర్ యాజమాన్యాన్ని కోరారు. ఉప కార్మిక కమిషనర్ రవీందర్ రెడ్డి , కార్మిక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.