రామచంద్రాపురం, వెలుగు: కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ ప్రొసీడింగ్స్ తయారు చేసి ప్రభుత్వ స్థలాన్ని కాజేయాలని చూసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే... సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు సర్వే నంబర్ 191లో కొంత ప్రభుత్వ స్థలం ఉంది. ఈ సర్వే నంబర్‌లోని కొంత భూమిని గతంలో పేదలకు అసైన్డ్ చేశారు. దీనిని అదనుగా తీసుకున్న వీరేశం అనే వ్యక్తి ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా తన తండ్రి బాలయ్యకు ఫ్రీడం ఫైటర్ కోటాలో 191 సర్వే నంబర్‌లో ఎకరం భూమి ఉందంటూ నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించాడు.
దీంతో పాటు కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఈ నెల 5న ఎన్‌వోసీ ప్రొసీడింగ్స్‌ను తయారుచేయించాడు. తర్వాత ఈ పేపర్స్‌తో భూమిని రాములు అనే వ్యక్తికి అమ్మేందుకు ప్రయత్నించాడు. ప్రొసీడింగ్స్ పేపర్స్‌పై అనుమానం వచ్చిన రామచంద్రాపురం తహసీల్దార్ సంగ్రామ్‌రెడ్డి ఈ నెల 7న కొల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీఐ రవీందర్.. వీరేశం, రాములుతో పాటు నకిలీ పేపర్స్ తయారు చేసిన సుధాకర్, నాగరాజు, సంతోష్‌ను అదుపులోకి తీసుకున్నారు.