
- టెన్షన్లో 100 నుంచి 200 మంది ఉద్యోగులు
- ఆన్ డ్యూటీ, వర్క్ ఆర్డర్ల వివరాల సేకరణ
సంగారెడ్డి, వెలుగు : జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగులు, సిబ్బంది చాలా కాలంగా డిప్యూటేషన్ల లో ఉండడంతో వాటిని రద్దు చేసేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా జిల్లాలో ఎంతమంది ఉద్యోగులు, సిబ్బంది డిప్యూటేషన్ లో ఉన్నారు, ఎంత కాలం నుంచి పనిచేస్తున్నారు, వివిధ పోస్టుల ఖాళీలు, నిబంధనలకు వ్యతిరేకంగా ఎంతమంది పనిచేస్తున్నారనే దానిపై నివేదిక కోరగా అధికారులు జాబితా సిద్ధం చేసినట్టు తెలిసింది.
మంత్రి ఆదేశాలతోనే ఈ ప్రక్రియ ముందుకు సాగుతుందని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగులు కోరుకున్న చోటుకు డిప్యూటేషన్ పై పోస్టింగ్ ఇచ్చారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మంత్రి వారి జాబితా కోరినట్టు తెలిసింది. డిప్యూటేషన్ల రద్దుపై వారం రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖలో ప్రచారం జరుగుతోంది.
జిల్లాలో ఇలా..
జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో100 నుంచి 200 మంది ఉద్యోగులు, సిబ్బంది డిప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తున్నట్టు ఆ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. డిప్యూటేషన్లే కాకుండా ఆన్ డ్యూటీ, వర్క్ ఆర్డర్ల పేరుతో విధులకు దూరంగా ఉన్న వారి జాబితా కూడా సేకరించినట్లు తెలుస్తోంది. పోస్టు, జీతం ఒకచోట ఉంటే మరోచోట పనిచేస్తున్న వారు చాలామంది ఉన్నారు. డిప్యూటేషన్లపై వివిధ హోదాల్లో కొందరు ఐదేళ్ల నుంచి 10 ఏళ్ల పాటు ఒకేచోట పని చేస్తున్నట్టు నివేదికలో బయటపడింది. డిప్యూటేషన్ల ఆర్డర్ కాపీలో గడువు పేర్కొనకపోవడంతో సదరు ఆఫీసర్ లేదా ఉద్యోగి చాలా ఏళ్లుగా ఒకే దగ్గర పనిచేస్తూ వస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాకు చెందిన వారు పక్క జిల్లాలో.. పక్క జిల్లా వారు సంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్నట్టు వెల్లడైంది. వీరిలో పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, సూపర్వైజర్లు, స్టాఫ్ నర్సులు, ఆఫీస్ సబార్డినేట్లు, అటెండర్లు, డ్రైవర్లు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎం, స్టాఫ్ నర్సులు, హెల్త్ ఎడ్యుకేటర్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు డిప్యూటేషన్లపై పనిచేస్తున్నవారిలో ఉన్నారు.
పైరవీలు షురూ..
డిప్యూటేషన్లపై ఉన్నతాధికారుల ముందస్తు చర్యలు ఎలా ఉంటాయో తెలియకఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది. ఉన్న చోటు నుంచి రెగ్యులర్ చోటుకు పంపిస్తారా.. లేక గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా మొదట్లో హడావిడి చేసి తర్వాత పైరవీలకు అవకాశం ఇస్తుందా అనే సందేహాలతో కొందరు అధికారుల చుట్టూ తిరుగుతున్నట్టు తెలిసింది. అవసరం లేకున్నా పోస్టులు లేని స్థానాల్లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ సొంత చోటుకి వెళ్లలేని ఉద్యోగులు చాలామంది ఉన్నారు. రెండేళ్లుగా సంగారెడ్డిలో రెగ్యులర్ డీఎంహెచ్ఓ లేరు. ఇన్చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు.ఏదేమైనా వైద్య ఆరోగ్య శాఖలో డిప్యూటేషన్ల వ్యవహారం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది.