ప్యారానగర్‌‌లో డంపింగ్‌‌యార్డ్‌‌ను రద్దు చేయాలి

ప్యారానగర్‌‌లో డంపింగ్‌‌యార్డ్‌‌ను రద్దు చేయాలి
  • హైదరాబాద్‌‌లో ప్రజా సంఘాలు, రైతుల ధర్నా

ముషీరాబాద్, వెలుగు : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామం ప్యారానగర్‌‌లో డంపింగ్‌‌ యార్డు ఏర్పాటును రద్దు చేయాలని ప్రజా సంఘాల పోరాట వేదిక నాయకులు, రైతులు కోరారు. ఈ మేరకు ప్రజాసంఘాల పోరాట వేదిక కన్వీనర్‌‌ కె.రాజయ్య, గోవర్ధన్‌‌రెడ్డి అధ్యక్షతన సోమవారం హైదరాబాద్‌‌లోని ఇందిరాపార్క్‌‌ వద్ద ధర్నా నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఎస్.వీరయ్య, పాలడుగు భాస్కర్, చుక్కా రాములు, వెంకట్‌‌రాములు హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. నల్లవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్యారానగర్‌‌ శివారులో ఉన్న 152 ఎకరాల్లో డంపింగ్‌‌ యార్డ్‌‌ ఏర్పాటు కోసం ప్రభుత్వం జీహెచ్‌‌ఎంసీ, రాంకీ సంస్థకు అప్పగించిందన్నారు. 

ఇందుకోసం ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టలేదన్నారు. డంపింగ్‌‌ యార్డ్‌‌ ఏర్పాటు కారణంగా గుమ్మడిదల, -హత్నూర మండలాలు, మెదక్‌‌ జిల్లాలోని నర్సాపూర్, శివ్వంపేట మండలాల ప్రజల భవిష్యత్‌‌ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

డంపింగ్‌‌ యార్డ్‌‌ వల్ల సుమారు 74 గ్రామాల్లో  3 లక్షల మంది ప్రజలపై ప్రభావం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి డంపింగ్‌‌ యార్డ్‌‌ అనుమతులను రద్దు చేసి, రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌‌ చేశారు. కార్యక్రమంలో వేదిక ప్రతినిధులు జైపాల్‌‌రెడ్డి, నాగేశ్వరరావు, జయరాజ్, రామకృష్ణ, శేఖర్, మల్లేశం గౌడ్‌‌ పాల్గొన్నారు.