సంగారెడ్డి జిల్లా నల్లంపల్లిలో ఘటన
రాయికోడ్, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో ఓ భార్య వివాహేతర సంబంధం భర్త ప్రాణం తీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయికోడ్ మండలం నల్లంపల్లికి చెందిన మొట్కె కృష్ణ(35) భార్య.. అదే గ్రామానికి చెందిన ప్రశాంత్‌తో కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. కొన్నాళ్ల కింద విషయం తెలుసుకున్న కృష్ణ పలుమార్లు భార్యను మందలించాడు. ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఇటీవల పుట్టింటికి పంపించాడు. దీంతో కృష్ణపై.. ప్రశాంత్కక్ష పెంచుకున్నాడు.
15 రోజుల కింద ఫుల్లుగా తాగొచ్చి కృష్ణతో గొడవపడ్డాడు. గురువారం రాత్రి సరుకుల కోసం షాపుకు వెళ్తున్న కృష్ణను ప్రశాంత్ గమనించాడు. కారం, ఇనుప రాడ్, బీర్సీసా తీసుకుని వెంబడించాడు. ఒక్కసారిగా కృష్ణ కళ్లలో కారం చల్లి, బీర్సీసా, ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఘటనా స్థలాన్ని సీఐ, ఎస్సై పరిశీలించారు. మృతుడి తల్లి నర్సమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతుడికి బాబు, పాప ఉన్నారు.