
జహీరాబాద్, వెలుగు: సూసైడ్ చేసుకోబోయిన ఓ వ్యక్తిని పోలీసులు కాపాడారు. శుక్రవారం ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్ట్ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జహీరాబాద్ కు చెందిన బోయిని కృష్ణ అప్పుల బాధ భరించలేక సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఈ విషయాన్ని అన్న వీరేశంకు ఫోన్ చేసి తాను చనిపోతున్నట్లు చెప్పాడు. వెంటనే వీరేశం డయల్100 కు కాల్ చేసి తన తమ్ముడు చనిపోతానని ఫోన్లో చెప్పాడని ఎలాగైనా రక్షించాలని కోరాడు. విషయం తెలుసుకున్న జహీరాబాద్ ఎస్ఐ శ్రీకాంత్, ఐటీ కోర్ సిబ్బంది సాయంతో కృష్ణ ఫోన్ నెంబర్ ట్రేస్ చేసి పుల్కల్ మండలం, సింగూర్ ప్రాజెక్ట్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. సమాచారాన్ని పుల్కల్ ఎస్ఐ క్రాంతి కి చేరవేశారు.
ఆయన సింగూర్ ప్రాజెక్ట్ సిబ్బందికి సమాచారం అందించారు. ప్రాజెక్టు సిబ్బంది లక్ష్మణ్, నరేశ్సింగూర్ ప్రాజెక్ట్ లో దూకిన బోయిని కృష్ణను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. నిండు ప్రాణాన్ని కాపాడిన పోలీసులకు, ప్రాజెక్టు సిబ్బందికి బోయిని కృష్ణ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.