
- టార్గెట్ సగం కూడా పూర్తికాలే
- ముగ్గురు కమిషనర్లతో సహా 66 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చిన కలెక్టర్
- 24 గంటల్లోగా సంజాయిషీ ఇయ్యకుంటే శాఖాపరమైన చర్యలు
సంగారెడ్డి, వెలుగు: మునిసిపల్ ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్ల వ్యవహారం సంగారెడ్డి జిల్లాలో సమస్యగా మారింది. లక్ష్యం బారెడు ఉంటే వసూళ్లు మాత్రం మూరడే అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలు ఉండగా అందులో 4 బల్దియాలు కొత్తగా ఏర్పడ్డాయి. మిగిలిన సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, నారాయణఖేడ్, తెల్లాపూర్, అమీన్పూర్, ఆందోల్-జోగిపేట, బొల్లారం మున్సిపాలిటీలలో స్పెషల్ ఆఫీసర్ల పాలన అస్తవ్యస్తంగా మారింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 31లోగా పన్నులు వసూళ్లు కావాల్సి ఉండగా కోట్లల్లో పేరుకుపోయాయి.
దీంతో జిల్లా యంత్రాంగం వంద శాతం వసూళ్ల కోసం స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తోంది. కానీ కొందరు మున్సిపల్ కమిషనర్లు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పెండింగ్ బకాయిలలో ఇప్పటికీ సగం కూడా పూర్తి చేయలేకపోయారు. ఒకటి రెండు మినహా మిగతా మున్సిపాలిటీలలో పన్నుల వసూళ్లు 50 శాతం కూడా రీచ్ కాలేదు. దీంతో కలెక్టర్ వారంరోజుల్లో ముగ్గురు కమిషనర్లు, 5 గురు మేనేజర్లు, బిల్ కలెక్టర్లు, ఆర్ఐలు కలిపి 66 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
ఇంకా 15 రోజులే..
ఈ నెల 31లోగా పన్నులు చెల్లించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రభుత్వం ఆదేశించినా చాలా మున్సిపాలిటీలో ప్రచారం కనిపించడం లేదు. ఏప్రిల్ 1 నుంచి పెండింగ్ లో ఉన్న బకాయిలపై 25 శాతం అదనంగా వడ్డీ వసూలు చేయనున్నట్టు తెలిసింది. పన్నుల వసూళ్లకు 15 రోజులే గడువు ఉండడంతో వందశాతం వసూళ్లు కష్టంగా మారింది. పన్ను వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జహీరాబాద్, సదాశివపేట మున్సిపల్ బిల్ కలెక్టర్లు ఖుర్షీడ్ హమ్మద్, శ్రీకాంత్ ను సస్పెన్షన్ చేయగా, వివిధ మున్సిపాలిటీలకు చెందిన మరో 17 మందికి కలెక్టర్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
అప్పటికీ పనితీరులో మార్పు రాకపోవడంతో శనివారం ముగ్గురు కమిషనర్లు 49 మంది సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. షోకాజ్ నోటీసులు అందుకున్న వారిలో సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్లు వీకే ఛావన్, జే.ఉమా, ఉమామహేశ్వరరావుతోపాటు పలువురు మేనేజర్లు, బిల్ కలెక్టర్లు, ఆర్ఐలు ఉన్నారు. 24 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ షోకాజ్ ల ఎఫెక్ట్ కారణంగా ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ జిల్లాలోని అన్ని మున్సిపల్ ఆఫీసుల్లో పన్ను వసూలు చేసే కౌంటర్లు తెరిచే ఉంచారు.
మున్సిపాలిటీల వారీగా బకాయిలు..
సంగారెడ్డి మున్సిపాలిటీలో ఇంటి పన్నులు మొత్తం రూ.13.2 కోట్లకురూ.6.42కోట్లు మాత్రమే వసూలు చేశారు. ఇంకా రూ.6.60 కోట్లు వసూలు చేయాలి. సదాశివపేటలో రూ.1.13 కోట్లు ప్రాపర్టీ టాక్స్ లకు వసూలు చేసింది రూ.30 లక్షలు కాగా రూ.83 లక్షలు పెండింగ్ లో ఉన్నాయి. నారాయణఖేడ్ బల్దియాలో ప్రాపర్టీ ట్యాక్స్ రూ.2.30 కోట్లు కాగా వసూలు చేసింది రూ.1.90 కోట్లు ఇంకా రూ.40 లక్షలు పెండింగ్ లో ఉన్నాయి. జహీరాబాద్ లో ప్రాపర్టీ ట్యాక్స్ రూ.16కోట్లు ఉండగా, రూ.5.8 కోట్లు వసూలయ్యాయి.
అందోల్-జోగిపేటలో రూ.1.32 కోట్లు రావాల్సి ఉండగా, రూ.82 లక్షలు వసూలయ్యాయి. ఇంకా రూ.50 లక్షలు రావాల్సి ఉంది. బొల్లారం మున్సిపాలిటీలో రూ.16.25 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా, రూ.11.90 కోట్లు వసూలు చేశారు ఇంకా రూ.4.34 కోట్లు రావాల్సి ఉంది. తెల్లాపూర్ బల్దియాలో రూ.25 కోట్లకు వసూలు చేసింది రూ.14.9 కోట్లు మాత్రమే ఇంకా రూ.9.5 కోట్లు బ్యాలెన్స్ ఉన్నాయి. అమీన్ పూర్ మున్సిపాలిటీలో మొత్తం రూ.40 కోట్ల పన్ను వసూలు కావాల్సి ఉండగా రూ.29.46 కోట్లు వసూలు చేశారు ఇంకా రూ.10.54 కోట్లు పెండింగ్లో ఉంది.