సెప్టిక్‌‌ ట్యాంకర్‌‌లో గంజాయి..1.2 కోట్ల విలువైన 205 కేజీల గంజాయి స్వాధీనం  

సెప్టిక్‌‌ ట్యాంకర్‌‌లో గంజాయి..1.2 కోట్ల విలువైన 205 కేజీల గంజాయి స్వాధీనం  

పటాన్‌‌చెరు, వెలుగు : సెప్టిక్‌‌ ట్యాంకర్‌‌లో తరలిస్తున్న గంజాయిని బుధవారం సంగారెడ్డి జిల్లా టాస్క్‌‌ఫోర్స్‌‌ పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎక్సైజ్‌‌ సూపరిండెంట్‌‌ ఎస్‌‌.నవీన్‌‌చంద్ర బుధవారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్రలోని సోలాపూర్‌‌కు చెందిన దీపక్‌‌ నాగ్నాథ్‌‌ గోయ్‌‌, నారాయణ్‌‌ఖేడ్‌‌కు చెందిన భీమసింగ్‌‌ మాధవ్‌‌తో కలిసి గంజాయి వ్యాపారం ప్రారంభించారు.

ఇందులో భాగంగా ఎవరికీ అనుమానం రాకుండాఉండేందుకు భీమసింగ్‌‌ మాధవ్‌‌కు చెందిన సెప్టిక్‌‌ ట్యాంకర్‌‌లో గంజాయి తరలించేందుకు ప్లాన్‌‌ చేశారు. ఇటీవల ఆంధ్రా, ఒడిశా బార్డర్‌‌లోని చిత్రకొండ వెళ్లి 205 కిలోల గంజాయిని కొని ట్యాంకర్‌‌లో నింపారు. గంజాయి కనిపించకుండా చెత్త, ప్లాస్టిక్‌‌, పని స్థలాల్లో వాడే హెల్మెట్లు వేశారు.

అనంతరం చిత్రకొండ నుంచి భద్రాచలం, సూర్యాపేట, పెద్ద అంబర్‌‌పేట, పటాన్‌‌చెరు మీదుగా మహారాష్ట్రకు వెళ్తున్నారు. ఈ క్రమంలో బుధవారం పటాన్‌‌చెరు పరిధిలోని కొల్లూరు ప్రాంతం వద్దకు రాగా అక్కడే ఉన్న టాస్క్‌‌ఫోర్స్‌‌ సీఐ దుబ్బాక శంకర్‌‌ అనుమానంతో ట్యాంకర్‌‌ను ఆపి తనిఖీ చేయడంతో గంజాయి తరలింపు బయటపడింది.

దీంతో రూ. 1.2 కోట్ల విలువైన 205 కేజీల గంజాయి, ట్యాంకర్‌‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు, నాగ్నాథ్‌‌ గోయ్‌‌, భీమసింగ్‌‌ మాధవ్‌‌ను అరెస్ట్‌‌ చేశారు. భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్న సీఐ శంకర్, ఎస్సైలు సతీశ్‌‌, శ్రీనివాస్‌‌రెడ్డి, జి.హన్మంత్, కానిస్టేబుళ్లు అంజిరెడ్డి, అరుణజ్యోతి, ప్రభాకర్, శివకాంత్‌‌ను ఉన్నతాధికారులు అభినందించారు.