
- నిందితుల్లో ఇద్దరు మహిళలు
- ఈ నెల 2న సంగారెడ్డి జిల్లా తేర్పోల్లో ఘటన
- ముగ్గురు అరెస్ట్..పరారీలో మరికొందరు
కొండాపూర్, వెలుగు : ‘వి ఆర్ ఫ్రం సీబీఐ’ అంటూ ఓ ఇంటికి వచ్చిన కేటుగాళ్లు సోదాలు చేస్తున్నట్టు నటించి.. సామాన్లను చిందరవందరగా పడేసి, మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ ఎస్ఐ వెంకటేశం కథనం ప్రకారం..ఈనెల 2వ తేదీన తేర్పోల్ గ్రామానికి చెందిన సూరు ప్రమీల,ఈమె కూతురు సిరిచందనతో ఇంట్లో ఉండగా మధ్యాహ్నం 2 గంటలకు ఐదుగురు వ్యక్తులు కారులో వచ్చారు. అక్కడ ఇద్దరు కాపలా ఉండగా, ఇద్దరు ఆడవాళ్లు, ఒక మగ వ్యక్తి ఇంట్లోకి వచ్చారు. తాము సీబీఐ నుంచి వచ్చామని చెప్పి ఇంటిని తనిఖీ చేయాలన్నారు.
ఇంట్లోకి చొరబడి సామాన్లను చిందరవందరగా పడేస్తుండగా ప్రమీల తాము వ్యవసాయం చేసుకుని బతికేవాళ్లమని, తమ దగ్గర ఏముంటాయని ప్రశ్నించింది. దీంతో దొంగల్లోని ఓ మహిళ ప్రమీలపై దాడి చేసి నోట్లో బట్టలు కుక్కింది. మెడలోని మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడు గుంజుకుంది. పైసలు ఎక్కడున్నాయో చెప్పాలని, లేకపోతే చంపేస్తామని హెచ్చరించింది. తమ దగ్గర ఏమీ లేవని చెప్పడంతో వెళ్లిపోయారు. అదే రోజు ప్రమీల పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటినుంచి దొంగల కోసం పోలీసులు వెతుకుతున్నారు. బుధవారం మండలంలోని మల్కాపూర్ చౌరస్తా వద్ద తనిఖీలు చేస్తుండగా తేర్పోల్ గ్రామానికే చెందిన సంధిల గౌస్, పటాన్చెరు మండలం ముత్తంగికి చెందిన సాయి జాదవ్, సదాశివపేట మండలం ఆత్మకూరుకు చెందిన వడ్డే లక్ష్మి అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులో తీసుకొని విచారించారు. దొంగతనం చేసింది తామేనని ఒప్పుకోవడంతో బంగారం స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. ఆందోల్మండలం బ్రాహ్మణపల్లి చెందిన మరో వ్యక్తితో పాటు ఇంకొందరు పరారీలో ఉన్నారని ఎస్ఐ చెప్పారు. ఏఎస్ఐలు గౌసొద్దీన్, సూర్య, హెడ్ కానిస్టేబుల్ కృష్ణ, కానిస్టేబుల్స్ శ్రీరామ్, హేంసింగ్, శివ పాల్గొన్నారు.