జహీరాబాద్​ రైల్వే స్టేషన్​కు మహర్దశ

జహీరాబాద్​ రైల్వే స్టేషన్​కు మహర్దశ
  •     ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
  •      ‘అమృత్ భారత్’ కు జహీరాబాద్, వికారాబాద్, తాండూర్ రైల్వే స్టేషన్ల ఎంపిక
  •      ఈనెల 6న వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ

సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ రైల్వే స్టేషన్​ రూపురేఖలు మారనున్నాయి.  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ భారత్ స్టేషన్ స్కీం (ఏబీఎస్ సీ)కు జహీరాబాద్​తోపాటు  వికారాబాద్ జిల్లాలోని తాండూరు, వికారాబాద్ రైల్వే స్టేషన్లు ఎంపికయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ పథకం కింద ఎంపికైన స్టేషన్ల ఆధునీకీకరణ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 6న వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. ఒక్కో స్టేషన్​కు రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల చొప్పున ఖర్చు చేసి మౌలిక వసతులు కల్పించనున్నారు. పనులు పూర్తయ్యాక ఆయా స్టేషన్ల ముఖచిత్రం పూర్తిగా మారనుంది.

అయితే దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ లోని వికారాబాద్-–పర్లీ వైద్యనాథ్ మార్గంలో ప్రధానమైన జహీరాబాద్, వికారాబాద్ స్టేషన్లను గతంలో యూపీఏ ప్రభుత్వం ఆదర్శ స్టేషన్లుగా ఎంపిక చేసి డెవలప్ చేసింది. ఈ క్రమంలో దాదాపు 10 ఏండ్ల తర్వాత మోడీ ప్రభుత్వం అమృత్ భారత్ లో చోటు కల్పించడంతో ఆ మూడు స్టేషన్లకు మహర్దశ పట్టింది. ఈ మూడు స్టేషన్ల డెవలప్​మెంట్​  నమూనాలను రైల్వే అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు.

జహీరాబాద్, తాండూర్ స్పెషల్

వ్యాపార, వాణిజ్య పరంగా సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ రైల్వే స్టేషన్ ఆ శాఖకు స్పెషల్ గా నిలుస్తోంది. ఈ స్టేషన్ నుంచి ఏడాదికి దాదాపు రూ. 153 కోట్ల ఆదాయాన్ని రైల్వే శాఖకు సమకూరుస్తుండగా ఇదే తరహాలో వికారాబాద్ జిల్లాలోని తాండూరు రైల్వే స్టేషన్ నుంచి కూడా ఏడాదికి రూ.146 కోట్ల ఆదాయం వెళ్తున్నట్టు ఆ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. నిత్యం సుమారు 10 వేల మంది ప్రయాణీకులు ఈ రెండు రైల్వేస్టేషన్ల మధ్య రాకపోకలు సాగిస్తుంటారు. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిపోయే ప్రయాణీకులు ఇక్కడ ఎక్కువగా ఉంటారు.

అయితే జహీరాబాద్, తాండూరు ప్రాంతాల్లో ఎక్కువగా ఫ్యాక్టరీలు ఉండడం వల్ల ఆయా కర్మగారాల ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి గూడ్స్ రైళ్లను నడుపుతున్నారు. జహీరాబాద్, వికారాబాద్ తాండూరు రైల్వే స్టేషన్లను ఆధునికీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం పట్ల ఆయా ప్రాంతాల వ్యాపారులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆధునిక అంగులతో...

ఆధునికీకరణ పనులతో మూడు రైల్వేస్టేషనల్లో ఆధునిక హంగులతో భవనాలు, ఫ్లోరింగ్ నిర్మించనున్నారు. ట్రాక్ ల శుభ్రత, దివ్యాంగుల కోసం చక్రాల కుర్చీలు, ఆధునిక ట్రాక్ ల ఏర్పాటు, ఎంట్రన్స్ లో ర్యాంపులు, కేఫ్ ఏరియా, రెస్ట్ రూమ్స్ ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటు స్థానిక ఉత్పత్తులకు కనీసం రెండు స్టాళ్లు, రూఫ్ ప్లాజా, మీటింగ్ హాళ్లు, స్టేషన్లకు ఇరువైపులా అప్రోచ్ రోడ్లు, వెహికల్స్ నిలిపేందుకు ఆధునిక స్థల ఏర్పాటు, పాదాచారులకు స్పెషల్ దారి, ఆధునిక లైటింగ్ తో సహా స్పీడ్ వై ఫై 5జీ సేవలకు టవర్లు నిర్మించనున్నారు. అయితే ఆయా సౌకర్యాలను దశలవారీగా మెరుగుపరిచేందుకు ఏడాది నుంచి ఏడాదిన్నర కాలంలో పూర్తి చేయాలని అధికారులు నిర్దేశించారు.