- యాజమాన్యంతో మంత్రి దామోదర రాజనర్సింహ చర్చలు
- ఒక్కో కుటుంబానికి రూ.41లక్షల పరిహారం ఇచ్చేలా ఒప్పందం
- అంతకుముందు న్యాయం కోసం రోడ్డెక్కిన కార్మికులు
- ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించిన ప్రభుత్వం
సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ ఎస్ బీ ఆర్గానిక్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. బుధవారం సాయంత్రం రియాక్టర్ పేలి ఫ్యాక్టరీ డైరెక్టర్ తో సహా ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, ఘటన జరిగిన ప్రాంతంలో శిథిలాల కింద గురువారం మరో కార్మికుడి మృతదేహం దొరికింది. ఇతడిని కొన్యాల గ్రామానికి చెందిన కార్మికుడు రమేశ్గా గుర్తించారు. తోటి కార్మికులు ఈ విషయాన్ని రమేశ్ కుటుంబసభ్యులకు తెలియజేయడంతో వారు ఫ్యాక్టరీ ప్రధాన గేటు వద్ద బైఠాయించి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ వద్ద ఐదు గంటల పాటు కూర్చున్నా యాజమాన్యం నుంచి స్పందనలేకపోవడంతో సంగారెడ్డి–-నర్సాపూర్ మెయిన్‌రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువైపులా ట్రాఫిక్స్తంభించడంతో పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా లేపి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
ఒక్కో కుటుంబానికి రూ.41లక్షల ఎక్స్‌గ్రేషియా..
మంత్రి దామోదర్ రాజనర్సింహా గురువారం సాయంత్రం యాజమాన్యంతో చర్చలు జరిపారు. బాధిత కుటుంబసభ్యుల సమక్షంలో జరిపిన ఈ చర్చల్లో ఒక్కో కుటుంబానికి రూ.41 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యం ఒప్పుకుంది. ఈ మేరకు ఆరుగురు మృతుల కుటుంబాలకు త్వరలోనే పరిహారం అందనుంది. కాంగ్రెస్ తరఫున కూడా ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఇన్స్పెక్టర్ఆఫ్ ఫ్యాక్టరీస్, ఫైర్ఆఫీసర్లతో కలిసి కలెక్టర్ వల్లూరి క్రాంతి దర్యాప్తు ప్రారంభించారు. ఫ్యాక్టరీలో ఉన్న బాయిలర్ వద్ద ఆయిల్ లీక్ కావడం వల్లే మంటలు ఏర్పడి రియాక్టర్ పేలినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తేలడంతో యాజమాన్యంపై చర్యలకు సిఫార్సు చేయనున్నట్లు తెలిసింది.
క్రిమినల్కేసు పెట్టాలి: ఎమ్మెల్యే హరీశ్
ఎస్ బీ ఆర్గానిక్ ఫ్యాక్టరీపై క్రిమినల్ కేసుపెట్టాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న కార్మికులను పలకరించిన అనంతరం ఫ్యాక్టరీ వద్ద బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆ తర్వాత హరీశ్ మీడియాతో మాట్లాడారు. కార్మికుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. ఇద్దరు మంత్రులు వచ్చినా నయాపైసా సాయం అందలేదన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.50 లక్షలు, క్షతగాత్రులకు రూ.25 లక్షల చొప్పున ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, సునీతా లక్ష్మారెడ్డి, మెదక్ ఎంపీ అభ్యర్థి పి.వెంకట్రామరెడ్డి ఉన్నారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు..
ఫ్యాక్టరీలో పేలుడుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని మల్టీ జోనల్ ఐజీ సుధీర్ బాబు తెలిపారు. ప్రమాద కారణాలను తెలుసుకునేందుకు గురువారం జిల్లా ఎస్పీ రూపేశ్ తో కలిసి ఫ్యాక్టరీని పరిశీలించారు. తర్వాత ఎస్పీ ఆఫీసులో మాట్లాడుతూ నైట్రేట్ కెమికల్ తయారీలో భాగంగా ఈ పేలుడు సంభవించినట్లు ప్రాథమికంగా తేలిందన్నారు. ఎస్పీ నేతృత్వంలో ప్రత్యేకంగా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా పటాన్ చెరు డీఎస్పీని నియమించామన్నారు.