భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ జంట విడిపోయిన విషయం తెలిసిందే. 13 ఏళ్ల వీరి దాంపత్య జీవితం వారం రోజుల కిందటే విచ్చిన్నమైంది. షరియా చట్టాల ప్రకారం సానియాకు విడాకులిచ్చిన మాలిక్.. పాకిస్తానీ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ చేదు జ్ఞాపకాల నుంచి భారత టెన్నిస్ స్టార్ ఎట్టకేలకు బయటపడింది. తనను తాను సమీక్షించుకుంటూ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది.
సానియా మీర్జాతో తన బంధం కొనసాగుతుండగానే షోయబ్.. సనా జావెద్‌తో యవ్వారాలు నడిపాడు. ఏడాది క్రితమే వీరు విడిపోతున్నారంటూ వార్తలు వచ్చినప్పటికీ.. అప్పుడప్పుడు ఈ జంట కలిసి కనిపించడంతో అవి రూమర్లని కొట్టిపారేసేవారు. ఇంతలోనే షోయబ్.. మీర్జాతో తన వివాహ బంధాన్ని తెగదెంపులు చేసుకుంటూ మరో ఇన్నింగ్స్‌కు తెరదీశాడు. సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించి అందరికి షాకిచ్చాడు.
ఈ ఘటనల అనంతరం సానియా మీర్జా ఎట్టకేలకు అభిమానుల ముందుకొచ్చింది. అద్దంలో తనను తాను చూసుకుంటున్న ఓ చిత్రాన్ని ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే, ఇక్కడ విడాకుల గురించి ఎలాంటి ప్రస్తావనా లేదు. కేవలం తనను తాను సమీక్షించుకుంటున్నట్లు అర్థం వచ్చేలా 'రిఫ్లెక్ట్’ (Reflect)' అంటూ ఓ సందేశాన్ని మాత్రమే నెటిజన్లతో పంచుకుంది. ప్రస్తుతం ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
కాగా, మొదట అయేషా సిద్దిఖీని రహస్యంగా వివాహమాడిన షోయబ్.. 2010లో ఆమెకు విడాకులిచ్చిన వెంటనే సానియా మీర్జాను రెండో పెండ్లి చేసుకున్నాడు. వీరిది ప్రేమ వివాహం. ఈ జంటకు 2018లో కొడుకు ఇజాన్ పుట్టాడు.