- నిధులు విడుదల చేసిన కేంద్రం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూళ్లలో శానిటరీ న్యాప్కిన్ మెషీన్లను ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్, నాగర్‌కర్నూల్, జయశంకర్ భూపాలపల్లి, కొమ్రంభీమ్ ఆసిఫాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, సిద్దిపేట జిల్లాల్లోని స్కూళ్లలో పైలట్ ప్రాజెక్టు చేపట్టనుంది. ఈ ఏడు జిల్లాల్లోని 50 స్కూళ్లలో 23,970 మంది చదువుకుంటున్నారు. ఆయా స్కూళ్లలోని స్టూడెంట్ల సంఖ్యను బట్టి 2 నుంచి 6 వరకు న్యాప్కిన్ వెండింగ్ మిషిన్లు ఏర్పాటు చేయనున్నారు.
అమ్మాయిలు తమకు అవసరమైనప్పుడు వెండింగ్ మిషిన్ బటన్ నొక్కితే, మూడు ప్యాడ్లతో కూడిన ప్యాకెట్ వస్తుంది. వాళ్లు తమకు అవసరమైనన్నీ ప్యాడ్స్ తీసుకోవచ్చు. వాడిన ప్యాడ్స్‌ను బయట పడేస్తే, అవి పర్యావరణానికి హాని చేస్తాయి. ఈ నేపథ్యంలో వాడిన ప్యాడ్లను కాల్చి బూడిద చేసేందుకు కూడా స్కూళ్లలో ప్రత్యేక మిషిన్లు(ఇన్సినెరేటర్) ఏర్పాటు చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టు అమలు కోసం 262 వెండింగ్ మిషిన్లు, 28.76 లక్షల ప్యాడ్లకు ఆరోగ్యశాఖ ఆర్డర్ ఇచ్చింది. 131 ఇన్సినెరేటర్లను సైతం కొనుగోలు చేస్తోంది. ఏడాది పాటు ఈ పైలట్ ప్రాజెక్ట్ కొనసాగనుంది. రాష్ట్రీయ కిషోర్ స్వస్త్య కార్యక్రమంలో(ఆర్‌కేఎస్‌కే) భాగంగా కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులు కూడా విడుదల చేసింది. పైలట్ ప్రాజెక్ట్‌లో వచ్చే ఫలితాలను బట్టి రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొస్తామని నేషనల్ హెల్త్ మిషన్ స్టేట్‌ఆఫీసర్ చెప్పారు.