కుంభమేళాలో శానిటేషన్​పై ఫోకస్

కుంభమేళాలో శానిటేషన్​పై ఫోకస్
  • త్రివేణి సంగమంలో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు
  • 3.50 లక్షల కిలోల బ్లీచింగ్ పౌడర్ వాడకం
  • అడ్వాన్స్డ్ ఆక్సిడేషన్ టెక్నాలజీతో క్లీనింగ్

మహాకుంభ్​నగర్(యూపీ): ప్రయాగ్​రాజ్​లోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో అధికారులు పారిశుధ్యంపై ఫోకస్ పెట్టారు. వాటర్​లో ఉన్న చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. ప్రైవేట్, గవర్నమెంట్ ఏజెన్సీలు కలిసి శానిటేషన్ ప్రక్రియ చేపడ్తున్నాయి. సుమారు కోటి లీటర్ల క్లీనింగ్ సొల్యూషన్​ను ఉపయోగించారు. 1.5 లక్షల టాయిలెట్లను శుభ్రపరుస్తున్నారు. టాయిలెట్ల శానిటైజేషన్ కోసం బెంగళూరు యూనివర్సిటీ డెవలప్ చేసిన అడ్వాన్స్డ్ ఆక్సిడేషన్ టెక్నాలజీని యూపీ ప్రభుత్వం ఉపయోగిస్తున్నది. 

మేళా ఏరియాలో ఇప్పటి వరకు 3.5 లక్షల కిలోల బ్లీచింగ్ పౌడర్, 75,600 లీటర్ల ఫినాయిల్, 41వేల కిలోల మాలథిన్​ను ఉపయోగించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు అన్ని క్లీనింగ్ ఏజెన్సీలు ఎకో ఫ్రెండ్లీ క్లీనింగ్ సొల్యూషన్​ను ఉపయోగిస్తున్నాయి. పారిశుధ్యంపై ఓ డెడికేటెడ్ టీమ్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నది. ప్రయాగ్​రాజ్​లోని బస్వర్​ప్లాంట్​లో రోజుకు సుమారు 650 టన్నుల చెత్తను ప్రాసెస్ చేస్తున్నారు. 

పారిశుధ్యం పరంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూస్తున్నామని మేళా నిర్వాహకులు వివరించారు. శానిటేషన్​లో పారిశుధ్య కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. వారికి అన్ని రకాల సౌలత్​లు మేళా ఏరియాలోనే ఏర్పాటు చేసినట్లు వివరించారు. రోజువారీ కూలి డబ్బులు.. నేరుగా వాళ్ల ఖాతాలోనే జమ అవుతున్నాయని తెలిపారు. కాగా, ఇప్పటి దాకా సుమారు 56 కోట్ల భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది.

మహిళల వీడియోలు తీస్తున్న ఆకతాయిల అరెస్ట్

త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్న, బట్టలు మార్చుకుంటున్న మహిళల వీడియోలు తీసి విక్రయిస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళల అసభ్యకర వీడియోలు షేర్ చేస్తున్న 103 సోషల్ మీడియా అకౌంట్ల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 

ఇలాంటి అకౌంట్లను గుర్తించేందుకు యూపీ సోషల్ మీడియా మానిటరింగ్ టీమ్ డెడికేటెడ్​గా పని చేస్తున్నదని వివరించారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ వీడియోలు విక్రయిస్తున్న, కొంటున్న వారిని అరెస్ట్ చేసి కేసు పెడుతున్నామన్నారు.