- పల్లెల్లో పర్యటించని స్పెషల్ ఆఫీసర్లు
- పంచాయతీల పాలకవర్గాలు లేక లోపిస్తున్న పాలన
మెదక్, సంగారెడ్డి, వెలుగు: మెదక్జిల్లాలోని వివిధ గ్రామాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. పంచాయతీల్లో పాలకవర్గాలు లేకపోవడం,స్పెషల్ ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో పల్లెల్లో చాలా సమస్యలు తిష్ట వేశాయి. వాతావరణ మార్పులు, ముసురు వర్షాలు, పరిసరాల పరిశుభ్రత లోపం, దోమలు పెరగడం వల్ల సీజనల్వ్యాధులు ప్రబలుతున్నాయి. డెంగ్యూ, టైఫాయిడ్, వైరల్ ఫీవర్కేసులు పెరుగుతున్నాయి. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన నిఖిల్ అనే యువకుడు డెంగ్యూ సోకి మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.
వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు జిల్లాలో 4 డెంగ్యూ, 12 టైఫాయిడ్, 52 వైరల్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. రామాయంపేట మండలం సుతార్పల్లిలో అనేక మంది అస్వస్థతకు గురైన నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ 157 మందికి బ్లడ్ టెస్టులు నిర్వహించగా అందులో ఒకరికి డెంగ్యూ, ముగ్గురికి టైఫాయిడ్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. కాగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జ్వరాలు సోకిన చాలా మంది తమ ప్రాంత పట్టణాల్లోని ప్రైవేట్హాస్పిట్సల్లో, కొందరు హైదరాబాద్లో బ్లడ్టెస్ట్లు చేయించుకుంటూ అక్కడే చికిత్స పొందుతున్నారు. దీంతో వ్యాధుల లెక్క పక్కగా తెలియడం లేదు.
జిల్లా ఆస్పత్రిలో రోగుల రద్దీ
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి కొద్ది రోజులుగా రోగుల తాకిడి పెరిగింది. ఇదివరకు ప్రతిరోజూ 500 మంది వరకు ఔట్ పేషంట్లు వచ్చే వారు కొన్నాళ్లుగా ఈ సంఖ్య దాదాపు 600 వరకు ఉంటోంది. ఇందులో వైరల్ ఫీవర్ బాధితులే సుమారు 100 మంది వరకు ఉంటున్నారు. జ్వర తీవ్రత ఎక్కువగా ఉన్న వారిని ఇన్ పేషంట్ గా అడ్మిట్ చేసుకుని చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో మొన్నటి వరకు జీతాలు రాకపోవడంతో గ్రామ పంచాయతీ, పారిశుధ్య సిబ్బంది సరిగా విధులు నిర్వర్తించ లేదు. ఈ కారణంగా గ్రామాల్లో పరిశుభ్రత కరువైంది. మోరీలు సరిగా శుభ్రం చేయకపోవడంతో చెత్తా చెదారం పేరుకుపోయి మురికి నీరు నిల్వ ఉంటోంది. కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్ల మీద ఏర్పడ్డ గుంతల్లో, ఇళ్ల మధ్యల ఉన్న ఖాళీ ప్రదేశాల్లో వర్షపు నీరు నిల్వ ఉండి దోమల ఉత్పత్తి కేంద్రాలుగా తయారయ్యాయి. ఇదివరకు వానాకాలం రాగానే దోమల నివారణ మందు పిచికారీ చేసేవారు ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం
లేదు.
సంగారెడ్డిలో..
జిల్లాలోని వివిధ గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. దీంతో చాలామంది సీజనల్వ్యాధుల బారిన పడుతున్నారు. డ్రైనేజీలు క్లీన్చేయకపోవడం, ఇండ్ల మధ్యలో చెత్త పేరుకుపోవడం, వాటర్ ట్యాంకుల వద్ద అపరిశుభ్రత, ముళ్లపొదల మధ్య నల్లాలు, బురద మయమైన రోడ్లు, దోమలు, పందుల స్వైర విహారం వల్ల చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు. దోమల నివారణకు ఫాగింగ్ చేయడంలేదు. మురికి నీరు నిల్వ ఉన్న చోట్ల బ్లీచింగ్ పౌడర్ చల్లడం లేదు. కొన్నిచోట్ల తాగునీటి పైప్ లైన్లు లీకేజీ అయి డ్రైనేజీ వాటర్కలవడంతో తాగునీరు కలుషితమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో చాలామంది డెంగ్యూ, వైరల్ ఫీవర్ కు గురై ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో మండల, డివిజన్ స్థాయి అధికారులు పంచాయతీల స్పెషల్ ఆఫీసర్లుగా అదనపు బాధ్యతలు మోస్తున్నారు. తమ సొంత శాఖల బాధ్యతలతో పాటు గ్రామాల పర్యవేక్షణ ఆఫీసర్లపై ఉండడంతో పని భారం వల్ల పంచాయతీల్లో పర్యటించలేకపోతున్నారు. కొందరు అధికారులు బాధ్యతగా పనిచేస్తుండగా మరి కొందరు అసలు గ్రామాల వైపే కన్నెత్తి చూడడంలేదు.
బడికి పోవాలంటే కాలువ దాటాల్సిందే..
సంగారెడ్డి మండలం చింతలపల్లి గ్రామంలో స్కూల్ పిల్లలు బడికి పోవాలంటే కాలువలో దిగి నడుచుకుంటూ పోవాల్సిన దుస్థితి నెలకొంది. చింతలపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పొలాల మధ్యలో నిర్మించారు. స్కూల్ సమీపంలో కాలువ ఉండడంతో చిన్నపాటి వర్షానికే అది నిండుకుంటుంది. అందులో నుంచే పిల్లలు స్కూల్కు వెళ్తున్నారు. కనీసం వారికోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదు. విద్యాశాఖ అధికారులు స్పందించి స్పెషల్ ఆఫీసర్ల ద్వారా టెంపరరీ రోడ్డు వేయించాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.