పంచాయతీల్లో పైసల్లేక పడకేసిన పారిశుధ్యం

  • ఖాళీ అయిన గ్రామ పంచాయతీల అకౌంట్లు, అస్తవ్యస్తంగా మారిన పాలన
  • తొమ్మిది నెలలుగా ఆగిన 15వ ఆర్థిక సంఘం నిధులు
  • ఏడాదిగా అందని స్టేట్‌‌ ఫైనాన్స్‌‌ కార్పొరేషన్‌‌ పైసలు
  • శానిటేషన్‌‌ పనులకు తిప్పలు పడుతున్న ఆఫీసర్లు

పల్లెల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో కలెక్టర్లు అన్ని గ్రామాలు, పట్టణాల్లో కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. కానీ ఖర్చు పెట్టేందుకు పంచాయతీల్లో నయాపైసా కూడా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఎన్నికల ముందే నిధులను ఊడ్చేసిన బీఆర్‌‌ఎస్‌‌

గ్రామ పంచాయతీలకు స్టేట్‌‌ ఫైనాన్స్‌‌ కార్పొరేషన్‌‌ నుంచి రావాల్సిన నిధులు ఏడాదిగా, 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు తొమ్మిది నెలల కింద ఆగిపోయాయి. ప్రతి మూడు నెలలకు ఓసారి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులను గత బీఆర్‌‌ఎస్‌‌ సర్కార్‌‌ ఆపేసింది. కేంద్రం నుంచి డైరెక్ట్‌‌గా పంచాయతీల ఖాతాల్లో జమ కావాల్సిన నిధులను బీఆర్‌‌ఎస్‌‌ సర్కార్‌‌ పల్లె ప్రగతి పేరుతో విడుదల చేసింది.

కానీ కేంద్రం నుంచి వచ్చిన నిధులతో పాటు, ఎస్‌‌ఎఫ్‌‌సీ నిధులను సైతం బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఊడ్చేసింది. దీంతో ఇప్పుడు పైసలు లేక గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన అడుగు కూడా ముందుకు కదలడం లేదు.

బ్లీచింగ్‌‌ పౌడర్‌‌కు కూడా పైసల్లేవ్‌‌..

రాష్ట్ర వ్యాప్తంగా 12,769 పంచాయతీలు ఉండగా మెయింటెనెన్స్‌‌ కోసం మేజర్‌‌ గ్రామాలకు నెలకు రూ. 2.50 లక్షలు, మైనర్‌‌ పంచాయతీలకు రూ. 1.50 లక్షల చొప్పున ఖర్చు అవుతుంది. ప్రసుత్తం పంచాయతీల ఖాతాల్లో చిల్లి గవ్వ కూడా లేకపోవడంతో  బ్లీచింగ్‌‌ పౌడర్‌‌ కొనేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. వానాకాలంలో సీజనల్‌‌ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు దోమల నివారణ, మురుగు కాల్వల క్లీనింగ్, మంచినీళ్ల ట్యాంకుల్లో బ్లీచింగ్‌‌ పౌడర్‌‌ చల్లాల్సి ఉంటుంది.

అలాగే గ్రామాల్లో వీధి లైట్లు కాలిపోతే వాటి స్థానంలో ఎల్‌‌ఈడీ బల్బులు బిగించాలి. అలాగే దోమల నివారణకు ఫాగింగ్‌‌ ఖర్చు కనీసం రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు అవుతోంది. కానీ పైసలు లేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టకపోవడంతో గ్రామాల్లో మురుగునీరు, చెత్తచెదారం కుప్పలుకుప్పలుగా పేరుకుపోయింది.

పంచాయతీల నుంచి రావాల్సిన ఇంటి పన్నులు కూడా వసూలు కావడం లేదు. గ్రామాల్లో చెత్త తొలగించేందుకు గత సర్కార్‌‌ ట్రాక్టర్లను కొనుగోలు చేసింది. డీజిల్‌‌ కొనేందుకు కూడా డబ్బులు లేవంటూ ట్రాక్టర్లను పక్కన పెట్టేశారు. ఎస్‌‌ఎఫ్‌‌సీ నిధులు వస్తాయన్న ఆలోచనతో కొందరు సర్పంచ్‌‌లు ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ నిధులు రాకపోవడంతో కిస్తీలు కట్టడం ఇబ్బందిగా మారింది.

పారిశుద్ధ్య కార్మికుల సహాయ నిరాకరణ...

గ్రామ పంచాయతీల్లో జనాభా ప్రాతిపదికన గత ప్రభుత్వం మల్టీపర్పస్‌‌ వర్కర్లను నియమించింది. ప్రతి గ్రామంలో ముగ్గురి నుంచి తొమ్మిది మంది వరకు పనిచేస్తున్నారు. వీరికి ప్రతి నెల గ్రామ పంచాయతీ నిధుల నుంచే రూ.9,500 జీతం చెల్లించాల్సి ఉంది. కానీ గత బీఆర్‌‌ఎస్‌‌ సర్కార్‌‌ వీళ్ల జీతాలు ఆపేసింది. అలాగే సర్పంచ్‌‌ల పదవీకాలం ముగిసే నాటికే గ్రామాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు బిల్లులు పెండింగ్‌‌లో ఉన్నాయి.

వీటి కోసమే మాజీ సర్పంచ్‌‌లు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. కానీ పంచాయతీల్లో నిధులు లేక పాలన గాడితప్పడంతో ఇటు ప్రజా ప్రతినిధులు, అటు ప్రత్యేక అధికారులు గ్రామాల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. 

జనాలు రోగాల బారిన పడుతున్నారు

గ్రామాల్లో మురుగునీరు, అంతర్గత రహదారులు, తాగునీటి వసతి, వీధిలైట్ల వంటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీలను క్లీన్‌‌ చేయకపోవడంతో దుర్వాసన వెదల్లుతోంది.పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగాయి. దీంతో ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉంది.

- వి. శ్రీనివాస్‌‌రెడ్డి, హజారిగూడెం 
మాజీ సర్పంచ్‌‌, అనుముల మండలం