జీతాల కోసం శానిటేషన్ సిబ్బంది వాటర్ ట్యాంక్ ఎక్కిన ఘటన వరంగల్ ఎంజీఎంలో జరిగింది. జీతాలకోసం శానిటేషన్ సిబ్బంది చేస్తున్న ఆందోళన ఉద్రిక్తత రేపుతోంది. ఏడు రోజులుగా శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సిబ్బంది ఆందోళన చేస్తున్నారు. అయితే సమస్యను పరిష్కరించకపోగా.. సిబ్బందిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. దాంతో పోలీసులతో వాగ్వాదానికి దిగిన సిబ్బంది... బిల్డింగ్ పైకి ఎక్కి నిరసన తెలిపారు. జీతాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ నినాదాలు చేశారు. కలెక్టర్ వచ్చి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
వరంగల్ ఎంజీఎంలో భవనం పైకి ఎక్కి నిరసన తెలుపుతున్న శానిటేషన్ సిబ్బంది.. తమ దీక్షలను భగ్నం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. గత వారం రోజులుగా ఎంజీఎంలో దీక్షలు చేస్తున్నామని శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సిబ్బంది తెలిపారు. మున్సిపల్ సిబ్బందితో ఎంజీఎంను క్లీన్ చేయించడంపై శానిటేషన్ సిబ్బంది ఆగ్రహం వ్యక్తంచేశారు. అరెస్ట్ చేసిన కార్మికులను విడుదల చేయాలని... తమకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం హాస్పిటల్ పోలీస్ బలగాల పహారాలో ఉంది. సిబ్బంది ఆందోళన విషయం తెలిసి.. వరంగల్ ఆర్డీవో వాసుచంద్ర ఎంజీఎంకు చేరుకున్నారు. అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.