- కొత్తగూడెం మున్సిపాలిటీలో కమీషన్ల కక్కుర్తి?
- మూన్నాళ్ల ముచ్చటగానే శానిటేషన్ వెహికల్స్
- సగానికి పైగా మాయమైన డస్ట్ బిన్స్
- కొనుగోళ్లపై విచారణ జరిపించాలని పలువురి డిమాండ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం మున్సిపాలిటీలో మెరుగైన శానిటేషన్అంటూ రూ.కోట్లు ఖర్చుపెట్టి ఇష్టారాజ్యంగా వెహికల్స్ కొనుగోలు చేశారు. మున్నాళ్లకే మూలకు వేశారు. వార్డుల్లో ఏర్పాటు చేసిన డస్ట్ బిన్స్ సగం వరకు మాయమయ్యాయి. ఆఫీసర్లు, పాకలకు కమీషన్లకు కక్కుర్తి పడి ప్రజాధనాన్ని వృథా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఐదేండ్లలో మున్సిపాలిటీలో జరిగిన కొనుగోళ్లపై విజిలెన్స్ విచారణకు కలెక్టర్ ఆదేశించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
- కొత్తగూడెం మున్సిపాలిటీలో మూడేండ్ల కిందట వార్డుల్లో రోడ్లు క్లీన్ చేసేందుకు దాదాపు రూ. 25లక్షలు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన చిన్న స్వీపింగ్ వెహికల్ ఏడాది కాకముందే మూలకు పడింది. దాన్ని ఇన్ టైంలో రిపేర్ చేయించకపోవడంతో అది శిథిలమవుతోంది.
- రూ. 80లక్షలకు పైగా ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన పెద్ద డ్రైనేజీలు క్లీన్ చేసే వెహికల్ మూడేండ్లలో పది సార్లు కూడా వాడిన దాఖలాలు లేవు. మున్సిపాలిటీలోని షెడ్లోనే ఈ వెహికల్ ఉంటుంది.
- రూ. 75లక్షలకు పైగా వెచ్చించి కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్ను కేవలం మంత్రులు, ఉన్నతాధికారులు వచ్చిన టైంలోనే వాడుతున్నారు. మిగతా టైంలో మూలకే ఉంటోంది.
- ఐదేండ్ల కింద దాదాపు రూ. 75లక్షల నుంచి రూ. కోటి ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన డస్ట్ బిన్స్ శిథిలమయ్యాయి. వార్డుల్లోని ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేసిన డస్ట్ బిన్స్ సగానికి పైగా మాయమయ్యాయి. ఏడాది కిందట మరోసారి ఇంటింటికీ డస్ట్ బిన్స్ పేర రూ. లక్షలు ఖర్చు పెట్టారు.
రికార్డులో మాత్రమే!
కొన్ని మిషన్లు అడపాదడపా వాడుతూ రెగ్యులర్గా వాడుతున్నట్టు రికార్డుల్లో చూపుతున్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని వెహికల్స్ను వాడకున్నా డీజిల్ లెక్కలు మాత్రం పక్కాగా చూపుతున్నారనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో మున్సిపాలిటీలో జరిగిన కొనుగోళ్లపై విజిలెన్స్ విచారణకు కలెక్టర్ ఆదేశించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
కమీషన్లకు ఇచ్చే ప్రాధాన్యత.. క్వాలిటీపై లేదు..
పది కాలాల పాటు ఉపయోగపడే విధంగా ఉండే వెహికల్స్ మున్నాళ్లకే మూలకు పడ్డాయి. అధికారులు కమీషన్లకు ప్రాధాన్యత ఇవ్వడం మూలంగానే క్వాలిటీ లేని వెహికల్స్ను మున్సిపాలిటీకి తీసుకువచ్చారు. మున్సిపాలిటీకి అవసరం ఉందా? లేదా? అనే ఆలోచన లేకుండా కొన్ని వెహికల్స్ను కోట్ల రూపాయలు పెట్టి కొని ప్రజాధనాన్ని వృథా చేశారు.
మునిగడప పద్మ, కౌన్సిలర్
వెహికల్స్ ను వినియోగంలోకి తెస్తాం
మున్సిపాలిటీ కొనుగోలు చేసి మూలకు పడిన శానిటేషన్ వెహికల్స్ లో వినియోగంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తాను. నెల రోజుల కిందటే బదిలీపై ఇక్కడికి వచ్చాను. గతంలో జరిగిన కొనుగోళ్లలో అక్రమాలు నాకు తెలియదు. అక్రమాల విషయాన్ని పరిశీలిస్తాను.
-శేషాంజనేయ స్వామి, మున్సిపల్ కమిషనర్, కొత్తగూడెం