- మహిళా వర్కర్లలో 35% మందికి రక్త హీనత
- ఏఐజీ హాస్పిటల్ స్ర్కీనింగ్‌లో వెల్లడి
- వర్కర్లందరికీ టెస్టులు చేయనున్న డాక్టర్లు
హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లు గుండెజబ్బుల బారిన పడే ప్రమాదంలో ఉన్నారని ఏఐజీ హాస్పిటల్ ప్రకటించింది. వరల్డ్ హార్ట్ హెల్త్ డే సందర్భంగా జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకు ఏఐజీ హాస్పిటల్ శుక్రవారం ఉచిత హార్ట్ హెల్త్ స్ర్కీనింగ్ నిర్వహించింది. ఈ క్యాంపులో 654 మంది కార్మికులకు గుండె సంబంధిత పరీక్షలు, రక్త పరీక్షలు చేసింది. ప్రాథమిక పరీక్షల ప్రకారం టెస్టులు చేయించుకున్న వారిలో 177 (27 శాతం) మందికి హైపర్ టెన్షన్ ఉన్నట్టుగా తేలింది. వీరికి గుండెజబ్బులు కూడా ఉన్నట్టుగా అనుమానించిన డాక్టర్లు, మరిన్ని టెస్టులు చేయించుకోవాలని సూచించారు. డాక్టర్ల సూచన మేరకు ఈ 177 మందికి ఏఐజీలోనే ఇతర టెస్టులు చేయిస్తున్నారు. ఇప్పటికే ఇందులో 58 మందికి గుండె జబ్బు ఉన్నట్టుగా గుర్తించామని హాస్పిటల్ యాజమాన్యం శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపింది. మహిళా వర్కర్లలో 35 శాతం మంది రక్తహీనతతో ఉన్నారని, 22 శాతం మందికి షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. వీరికి అవసరమైన మందులు అందజేశామని, జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లు అందరికీ హెల్త్ చెకప్స్ చేయించి, అవసరమైన చికిత్స చేస్తామని హాస్పిటల్ చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి వెల్లడించారు.
రీ యూజ్ ఆయిల్‌తో ముప్పు
ఎక్కువ మంది కార్మికుల్లో గుండెజబ్బు ఉండడానికి గల కారణాలపై డాక్టర్లు ఆరా తీశారు. కార్మికుల ఆహారపు అలవాట్లు, వర్కింగ్ స్టైల్‌ను పరిశీలించారు. ఎక్కువ మంది కార్మికులకు స్మోకింగ్ అలవాటు ఉన్నట్టు గుర్తించారు. కార్బొహైడ్రేట్స్ అధికంగా ఉండే ఆహారం, రోడ్లపై అమ్మే ఫ్రైడ్ ఫుడ్స్ తినడం వంటివి దాదాపు అందరిలో కామన్‌గా ఉన్న అలవాట్లుగా గుర్తించామని ఏఐజీ క్లినికల్ డైరెక్టర్, డాక్టర్ రాజీవ్ మీనన్ తెలిపారు. ఒకటి కంటే ఎక్కువసార్లు వినియోగించిన ఆయిల్‌తో చేస్తున్న ఫ్రైడ్ ఫుడ్స్ ను కార్మికులు తింటున్నారని, ఇది అనేక రోగాలకు కారణం అవుతుందన్నారు. కార్మికుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఈ క్యాంపుతో తమకు ఓ అవగాహన వచ్చిందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ అన్నారు. కార్మికులు అందరికీ టెస్టులు, ట్రీట్‌మెంట్ చేయించేందుకు ఏఐజీ హాస్పిటల్‌తో ఒప్పందం చేసుకుంటామని వెల్లడించారు.
ALSO READ: రేపటి నుంచి ఏం చేయాలి?.. రూ.2 వేల నోట్ల డిపాజిట్కు నేడే(సెప్టెంబర్ 30) ఆఖరు
ఏఈడీ మిషన్ల ఏర్పాటు ఎప్పుడో?
కరోనా తర్వాత తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సడెన్ కార్డియాక్ అరెస్ట్ కేసులు పెరిగాయి. జనాలు ఉన్నట్టుండి కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్న వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో అందరికీ సీపీఆర్‌పై అవగాహన కల్పించేందుకు ఆరోగ్యశాఖ తరపున క్యాంపులు, కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రంలోని హాస్పిటల్స్, బహిరంగ ప్రాంతాల్లో ఏఈడీ(ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్) మిషన్లను ఏర్పాటు చేస్తామని కూడా సర్కార్ ప్రకటించింది. సడెన్ కార్డియాక్ అరెస్ట్ కు గురయిన వారికి ఏఈడీలతో షాక్ ఇచ్చి, తిరిగి వారి గుండె కొట్టుకునేలా చేయొచ్చు. ఇలాంటి మిషన్లను దవాఖాన్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వంటి బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. మొత్తం1,262 మిషన్లు కొనుగోలు చేస్తున్నామని ప్రకటించారు. కానీ, ఇప్పటి వరకూ మిషన్ల కొనుగోలు ప్రక్రియ పూర్తి కాలేదు. ఇప్పటి వరకు ఒక్కచోట కూడా ఏఈడీ మిషన్లు ఏర్పాటు కాలేదు.