వరంగల్ సిటీ, వెలుగు : వరంగల్ ఎంజీఎం దవాఖానలోని సూపరింటెండెంట్ ఆఫీసు ఎదుట శుక్రవారం సాయంత్రం ముగ్గురు శానిటేషన్ కార్మికులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితుల కథనం ప్రకారం..వరంగల్ ఎంజీఎం దవాఖానలో జీవో నంబర్34 ద్వారా 35 మంది శానిటేషన్ కార్మికులను తీసుకున్నారు.
2019 నుంచి వీరు డ్యూటీలు చేస్తున్నారు. ఇందులో 19 మందిని తెలంగాణ అభ్యుదయ సొసైటీ తరపున మరో 16 మందిని కృష్ణ కన్స్ట్రక్షన్స్ ద్వారా భర్తీ చేశారు. కృష్ణ కన్స్ర్టక్ష్సన్ ద్వారా రూ.11వేల జీతం చెల్లిస్తుండగా, తెలంగాణ అభ్యుదయ సొసైటీ ద్వారా రూ.12వేలు ఇస్తున్నారు. దీంతో 16 మంది కార్మికులు తమకు అభ్యుదయ ఏజెన్సీ ద్వారానే జీతాలు చెల్లించాలని కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. చాలాసార్లు అధికారులకు మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో విసిగిపోయిన పద్మ, గడ్డం రమేశ్, వనజ అనే కార్మికులు శుక్రవారం సూపరింటెండెంట్ చాంబార్లో పురుగుల మందు తాగారు. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది హుటాహుటిన ఎమర్జెన్సీకి తరలించారు.
కలెక్టర్కు ఫైలు పంపాను : సూపరింటెండెంట్
16 మందిని తెలంగాణ అభ్యుదయ ఏజెన్సీ కింద తీసుకునేందుకు కలెక్టర్కు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ఎడ్యుకేషన్కు ఫైలు పంపినట్లు సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. అధికారుల నుంచి ఆమోదం వచ్చిన వెంటనే వారిని తెలంగాణ ఏజెన్సీ కింద పనిచేసేందుకు అనుమతిస్తామని, జీతాలు కూడా చెల్లిస్తామని చెప్పారు.