హైదరాబాద్ లో ఎక్కడి చెత్త అక్కడ్నే.. కంపు కొడుతుంద‌య్యా...

హైదరాబాద్ లో ఎక్కడి చెత్త అక్కడ్నే.. కంపు కొడుతుంద‌య్యా...

హైదరాబాద్​/ఎల్​బీ నగర్,వెలుగు:  సఫాయి కార్మికులు సమ్మెలో ఉండడంతో  రోడ్లపై ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి కంపు కొడుతుంది. కాలనీలు, బస్తీలు, మెయిన్ రోడ్లపై స్థానికులు ముక్కు మూసుకొని పోతున్న పరిస్థితి ఉంది. దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. చనిపోయిన కుక్కలు, పిల్లులు, ఎలుకలు రోడ్లపై వేస్తున్నారని, అటుగా వెళ్లాలంటేని భరించలేని దుర్వాసన వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా చెత్త తరలింపు కోసం ఏదైనా ప్రత్యామ్నాయం చూడాలని కోరుతున్నారు. లేదంటే రోగాలు ప్రబలే  ప్రమాదం ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్మికుల సమ్మె నాలుగో రోజు కొనసాగింది.  సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు తమను పర్మినెంట్ చేయాలని సోమవారం సర్కిల్​ ఆఫీసుల్లో కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళన చేశారు. ఎల్ బీనగర్, ఉప్పల్, అబిడ్స్, శేరిలింగంపల్లి, కాప్రా, చార్మినార్​తో పాటు మిగతా సర్కిల్ ఆఫీసుల్లో ఉదయం నుంచే నిరసనలు చేపట్టారు. 

ఎల్ బీనగర్లో వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇమ్లిబన్ డంపింగ్ యార్డు, లోయర్ ట్యాంక్ బండ్ డంపింగ్ యార్డుల వద్ద నిర్వహించిన ఆందోళనలో మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఊదరి గోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  నాలుగురోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం దారుమన్నారు. జీహెచ్ఎంసీ హెడ్డాఫీసు సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. అయితే, ఔట్ సోర్సింగ్ కార్మికులకు డబుల్ బెడ్రూం ఇచ్చే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం.