కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అర్థరాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు.. యాదాద్రి జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ లో ఉంచారు. అర్థరాత్రి కరీంనగర్ నుంచి యాదాద్రి వరకు తీసుకొచ్చారు. రాత్రి అంతా పోలీస్ స్టేషన్ లో ఉంచారు.
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అర్థరాత్రి ఇంటిపై దాడి చేసి ఎంపీని, జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేయటం అంటే.. పోలీసులు హద్దు మీరి ప్రవర్తించినట్లే అంటున్నారు బీజేపీ నేతలు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పకుండా.. కనీసం 41 నోటీస్ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని నిలదీస్తున్నారు. ఓ ఎంపీని అరెస్ట్ చేయాలంటే లోక్ సభ స్పీకర్ కు సమాచారం ఇవ్వాలని.. అలాంటి ఏమీ లేకుండా రాష్ట్ర పోలీసులు వ్యవహరించటం ఏంటని.. దీనిపై కోర్టుల్లో తేల్చుకుంటామని హెచ్చరిస్తున్నారు బీజేపీ నేతలు.
ఎంపీగా ఉన్న తనను నోటీసులు కూడా ఇవ్వకుండా.. ముందస్తు సమాచారం లేకుండా తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయటంపై.. లోక్ సభ స్పీకర్ కు కంప్లయింట్ చేశారు ఎంపీ బండి సంజయ్. ఇంట్లోకి వచ్చి పోలీసులు ఏ విధంగా బలవంతం చేసింది.. సమాధానం చెప్పకుండా దురుసుగా లాక్కెళ్లిన తీరును.. ఫొటోలు, వీడియోలతో సహా లోక్ సభ స్పీకర్ కు కంప్లయింట్ చేశారు బండి సంజయ్.
పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ ను ఉంచి బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ దగ్గరకు బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు.