ODI World Cup 2023: ఆ ఓటమితో ధోనీ చిన్న పిల్లాడిలా ఏడ్చాడు: సంజయ్ బంగర్

సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన 2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. ఈ ఓటమి భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత బాధను మిగిల్చింది. 7 మ్యాచుల్లో విజయం సాధించి టేబుల్ టాపర్ గా వెళ్లిన మన టీంకు న్యూజిలాండ్ షాక్ ఇచ్చింది. వర్షం కారణంగా రిజర్వ్ డే కు వెళ్లిన ఈ మ్యాచ్ లో ధోనీ, జడేజాల పోరాటంతో భారత్ గెలుస్తుందని ఆశించినా చివర్లో మాహీ రనౌట్ తో కివీస్ మ్యాచ్ గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది.

ఈ మ్యాచ్ అనంతరం క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు టీమిండియా ఆటగాళ్లు బాగా బాధపడ్డారు. రోహిత్ శర్మ అయితే ఏడ్చేశాడు. ఇదిలా ఉండగా ఎప్పుడు భావోద్వేగాలను అదుపులో పెట్టుకునే ధోనీ సైతం ఔటైన తర్వాత బాగా ఎమోషనల్ అవ్వడం సగటు క్రికెట్ అభిమానిని కలిచి వేసింది. అయితే డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిన తర్వాత ధోనీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేశాడని మాజీ కోచ్ సంజయ్ బంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

ALSO READ : ఏపీకి వైసీపీ తెగులు పట్టుకుంది.. దీనికి మందు జనసేన టీడీపీ ప్రభుత్వమే: పవన్ కళ్యాణ్

మాజీ కోచ్ బంగర్ మాట్లాడుతూ.. “ 2019 లో భారత్ అద్భుతమైన క్రికెట్ ఆడింది. లీగ్ దశలో మేము ఏడు మ్యాచ్‌లు గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉన్నాము. అయితే కివీస్ పై ఓటమితో ఎంఎస్ ధోనీ డ్రెస్సింగ్ రూమ్ లో చిన్నపిల్లల్లా ఏడ్చాడు. హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ కళ్లలో నీళ్లు తిరిగాయి. అని చెప్పుకొచ్చాడు. సహజంగా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడంలో ధోనీ దిట్ట. విజయాన్ని, ఓటమిని ఒకేరకంగా తీసుకొని ముందుకు వెళ్తాడు. కానీ ఆ రోజు మహీ ఏడ్చాడంటే ఆ ఓటమి ఎంత బాధ మిగిల్చిందో అర్ధం చేసుకోవచ్చు.