సంజూ బాబా ఫోకస్​లోకి..

అరవై ఏళ్లవాడయిన సంజూబాబా జీవితంలో అన్నీ ఎత్తుపల్లాలే. కొన్నాళ్లు డ్రగ్​ అడిక్ట్​గా, కొన్నాళ్లు ఖైదీగా తెరచాటుకెళ్లిపోయాడు. పడిన ప్రతిసారీ కెరటంలా పైకి లేవడం మాత్రం సంజయ్​దత్​కి అలవాటే. సినిమాల్లో ఎన్ని హిట్లు అందుకున్నాడో, ఎన్నిసార్లు అవుటాఫ్​ ఫోకస్​ అయ్యాడో చెప్పలేం. ఇప్పడు మళ్లీ  ఆయన  ఫోకస్ లోకి వచ్చాడు.  అయితే తెరమీదకు వస్తాడో రాడో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి.

మొదటి నుంచి వాళ్లది కాంగ్రెస్ ఫ్యామిలీ. తల్లి నర్గీస్ దత్, అప్పటి ప్రధాని ఇందిరకు సన్నిహితురాలు. తండ్రి సునీల్ దత్ కాంగ్రెస్ టికెట్​పై పోటీ చేసి అయిదుసార్లు లోక్​సభలోకి అడుగుపెట్టారు. చెల్లెలు ప్రియాదత్​ కూడా కాంగ్రెస్​ లీడరే. తండ్రికి వారసురాలిగా ముంబై సిటీ నుంచి కాంగ్రెస్ ఎంపీగా రెండుసార్లు గెలిచింది. అయినా బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ఈసారి కాంగ్రెస్​ను కాదని బీజేపీ మిత్రపక్షంతో మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు రావడంతో ఆయన ఫోకస్ లోకి వచ్చాడు. ఎన్డీయే కూటమిలో ఉన్న ‘రాష్ట్రీయ సమాజ్  పక్ష’లో చేరడానికి సెప్టెంబర్ 25న ముహూర్తం కూడా సిద్ధం చేసుకున్నట్లు ముంబై పొలిటికల్ సర్కిల్స్​లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఊహాగానాలను సంజయ్ దత్ కొట్టివేశాడు. తాను ఏ  రాజకీయ పార్టీలో చేరడం లేదంటూ వివరణ ఇచ్చాడు.

సంజయ్ దత్ కుటుంబానికి చాలా ఏళ్లుగా కాంగ్రెస్ తో అనుబంధం ఉంది.  తల్లి నర్గీస్ హిందీ సిన్మాల్లో ఒక వెలుగు వెలిగింది. రాజ్ కపూర్ జోడీగా ఆమె నటించిన సిన్మాలన్నీ  సూపర్ డూపర్ హిట్లయ్యాయి. హీరోయిన్​గా బిజీగా ఉన్న టైంలోనే ఆమె సోషల్ వర్క్ కూడా చేసేది  ‘ది స్పాస్టిక్ సొసైటీ ఆఫ్ ఇండియా’ సంస్థ తరఫున ఆమె చేసిన సోషల్ వర్క్ అప్పటి ప్రధాని ఇందిరకు దగ్గర చేసింది. ఈ అభిమానంతోనే  నర్గీస్​ని 1980లో రాజ్యసభకు నామినేట్ చేసింది అప్పటి ఇందిర ప్రభుత్వం. రాజ్యసభ మెంబర్​గా ఉండగానే ఆమె కేన్సర్ బారిన పడ్డారు. 1981లో పాంక్రియాటిక్ కేన్సర్​తో చనిపోయారు.

సమాజ్​వాదీతో పొలిటికల్ ఎంట్రీ

‘రాకీ’ సిన్మాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంజయ్ దత్ చాలా తక్కువ టైమ్​లోనే సత్తా చాటుకున్నాడు. యాక్షన్ హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. 1993లో జరిగిన ముంబై పేలుళ్లతో ఈ హీరో జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. ముంబై పేలుళ్లతో సంజయ్​కి సంబంధాలున్నాయన్న ఆరోపణలు వచ్చాయి. ‘టాడా’ చట్టం కింద 1993 ఏప్రిల్​లో అరెస్టు చేశారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడన్న కారణంతో టాడా కోర్టు ఆయనకు ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ సమయంలోనే సంజయ్ తొలిసారి రాజకీయాలపై దృష్టి పెట్టాడు. ఫ్యామిలీ అంతా కాంగ్రెస్​వాదులే అయినా సంజయ్ ఆ పార్టీకి దూరంగా ఉన్నాడు.  సమాజ్​వాది పార్టీ వైపు అడుగులు వేశాడు. ఒక దశలో 2009 లోక్​సభ ఎన్నికల్లో ఎస్పీ టికెట్​పై లక్నో సీటు నుంచి పోటీ చేయడానికి కూడా రెడీ అయ్యాడు. అయితే చివరి క్షణంలో లీగల్ ప్రాబ్లమ్స్ రావడంతో అది వర్కవుట్ కాలేదు. దీంతో సమాజ్​వాది పార్టీ ఆయనను జనరల్ సెక్రటరీగా నియమించింది. 2010 వరకు సంజయ్  ఈ పోస్టులో కొనసాగాడు. 2010 తర్వాత  నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు.

లేటెస్ట్​గా రాష్ట్రీయ సమాజ్ పక్ష వైపు చూపు

దాదాపు పదేళ్ల తర్వాత పొలిటికల్ సెకండ్ ఇన్నింగ్స్​కి సంజయ్ రెడీ అయినట్లు వార్తలొచ్చాయి. మహారాష్ట్రలో పార్టీని డెవలప్ చేయడానికి కొంతమంది సినీ ప్రముఖుల మద్దతు కూడగడుతున్నట్లు ఆర్​ఎస్పీ సీనియర్​ నేత మహదేవ్​ జంకార్​ చెప్పారు.

మా నాన్నను కాంగ్రెసే చంపేసింది

తన తండ్రి సునీల్ దత్ చావుకు కాంగ్రెస్ పార్టీయే కారణమని సంజయ్ అప్పట్లోనే సంచలన ప్రకటన చేశాడు. అప్పట్లో సంజయ్ నిరుపమ్ ముంబైలో శివసేన నాయకుడిగా ఉండేవారు. తర్వాత ఆయన కాంగ్రెస్​లో చేరారు. కాంగ్రెస్​లో చేరాలన్న నిరుపమ్ ప్రయత్నాలను సునీల్ దత్ వ్యతిరేకించారట. మహారాష్ట్ర  పార్టీ పెద్దలకు కూడా ఆయన ఈ విషయం చెప్పారట. అయినా సునీల్ వ్యతిరేకతను పక్కన పెట్టి సంజయ్ నిరుపమ్​ని కాంగ్రెస్​లోకి చేర్చుకున్నారట. దీంతో తమ తండ్రి తీవ్రంగా హర్ట్ అయ్యారని సంజయ్ దత్​ చెప్పాడు. చనిపోవడానికి నాలుగు రోజుల ముందు తనతో ఈ విషయం స్వయంగా చెప్పారని సంజయ్ వివరించారు. అప్పటి నుంచి కాంగ్రెస్​కి జూనియర్ దత్ దూరంగా ఉన్నారంటున్నారు రాజకీయ పండితులు.

ఇదొక్కటే కాదు కేసుల్లో ఇరుక్కుని, బెయిల్ రాక జైల్లో తాను పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అండగా నిలవలేదని కూడా సంజయ్ దత్​ ఫీలయినట్లు తెలిసింది. ఈ కారణాలతోనే  కాంగ్రెస్​కి దూరంగా ఉన్నట్లు ఎనలిస్టులు చెబుతున్నారు. దీంతో వ్యక్తిగతంగా మంచి ఫ్రెండ్ అయిన జంకార్ నాయకత్వంలోని ‘రాష్ట్రీయ సమాజ్ పక్ష’లో చేరాలని సంజయ్ దత్ నిర్ణయించుకుని ఉంటారని రాజకీయ పండితులు భావిస్తున్నారు. కాంగ్రెస్​కి దూరంగా, బీజేపీకి దగ్గరగా ఉండటంకూడా ఈ పార్టీ వైపు మొగ్గు చూపడానికి మరో కారణమై ఉంటుందని ఎనలిస్టులు అంటున్నారు.

అబ్బే …అలాంటిదేం లేదు

బీజేపీ ఫ్రెండ్లీ పార్టీ అయిన రాష్ట్రీయ సమాజ్ పక్షలో సంజయ్ దత్ చేరుతున్నట్లు వచ్చిన వార్తలు ముంబై  పొలిటికల్ సర్కిల్స్​లో దుమారం రేపాయి. దీంతో అటు సిన్మా రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ తీవ్ర చర్చలు మొదలయ్యాయి. దీంతో సంజయ్ దత్ అలర్ట్ అయ్యారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదంటూ వివరణ ఇచ్చారు.

రాష్ట్రీయ సమాజ్ పక్ష కథేంటి?

మహారాష్ట్ర వేదికగా పనిచేసే ‘రాష్ట్రీయ సమాజ్ పక్ష’ పార్టీని 2003లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్​లో పశు సంవర్ధకశాఖ మంత్రిగా ఉన్న మహదేవ్ జంకార్ ఈ పార్టీకి ఫౌండర్  ప్రెసిడెంట్. ప్రస్తుతం ఎస్.ఎల్.అక్కిసాగర్ ఈ పార్టీకి జాతీయ ప్రెసిడెంట్​గా ఉన్నారు. 2004 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ఎస్పీ తరఫున 38మంది పోటీ చేశారు. అప్పటికి ‘రిపబ్లికన్ లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్’లో ఆర్ఎస్పీ ఉండేది. ఈ ఎన్నికల్లో సమాజ్ పక్షకు 1,44,571 ఓట్లు వచ్చాయి. అదే ఏడాది జరిగిన లోక్​సభ ఎన్నికల్లో కూడా ఆర్ఎస్పీ పోటీ చేసింది. మహారాష్ట్ర నుంచి 12 మంది, కర్ణాటకలోని ఒక సీటు నుంచి సమాజ్ పక్ష కేండిడేట్లు బరిలో నిలిచారు. మొత్తంగా  పార్టీ 1,46, 571 ఓట్లు తెచ్చుకుంది. 2009 లోక్​సభ ఎన్నికల్లో కూడా ఆర్ఎస్పీ కేండిడేట్లు పోటీ చేశారు. మహారాష్ట్ర నుంచి 29 మంది, కర్ణాటక నుంచి ఒకరు, అసోం నుంచి ఇద్దరు, గుజరాత్ నుంచి ఒకరు బరిలో నిలిచారు. ఈసారి పార్టీకి వచ్చిన ఓట్లు పెరిగాయి. మహారాష్ట్రలో 1,90,743 ఓట్లు రాగా, దేశవ్యాప్తంగా 2,01, 065 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో మధా లోక్​సభ సీటు నుంచి ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)’ చీఫ్ శరద్ పవార్​పై మహాదేవ్ జంకార్ పోటీ చేసి ఓడిపోయారు. 2014 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎన్డీయే కూటమిలో ‘రాష్ట్రీయ సమాజ్ పక్ష’ చేరింది. బీసీల ప్రయోజనాలే మెయిన్ అజెండాగా ఈ పార్టీ పనిచేస్తోంది. యాదవులను ఎస్టీ జాబితాలోకి చేర్చాలన్నది  సమాజ్ పక్ష  పార్టీ ప్రధాన డిమాండ్.

ఫ్యామిలీ అంతా కాంగ్రెస్​ వైపే..

సంజయ్ తండ్రి సునీల్ దత్​ కూడా కాంగ్రెస్​ లీడరే.  మొదటిసారి 1984లో ముంబై నార్త్ వెస్ట్ సీటు నుంచి గెలిచి లోక్​సభలో అడుగు పెట్టారు. మొత్తం ఐదు సార్లు ఆయన కాంగ్రెస్ తరఫున పార్లమెంటుకు ఎన్నికయ్యారు. మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపీఏ –1 ప్రభుత్వంలో  స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్  మంత్రిగా కూడా పనిచేశారు. 2005లో హార్ట్ అటాక్​తో చనిపోయారు. మత సామరస్యంకోసం ముంబై నార్త్ నుంచి అమృత్ సర్ వరకు 1987లో ఆయన పాదయాత్ర చేశారు.

సునీల్ దత్ రాజకీయ వారసత్వాన్ని ఆయన బిడ్డ  ప్రియాదత్ తీసుకున్నారు. తండ్రి ప్రాతినిధ్యం వహించిన ముంబై నార్త్ వెస్ట్ సీటు నుంచి కాంగ్రెస్ కేండిడేట్​గా 2005లో పోటీ చేసి శివసేన కేండిడేట్​పై   గెలిచారు. 2009 లోక్​సభ ఎన్నికల్లో  ఆమె మరోసారి బరిలోకి దిగారు.ఈసారి  ముంబై నార్త్ సెంట్రల్ సీటు నుంచి ఆమె పోటీ చేసి గెలిచారు. అయితే 2014 లోక్ సభ ఎన్నికల్లో దివంగత ప్రమోద్ మహాజన్ కూతురు పూనమ్ మహాజన్ చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో కూడా పూనమ్ చేతిలోనే ప్రియాదత్ రెండోసారి ఓడిపోయారు. మొత్తంగా 2005 నుంచి 2014 వరకు తొమ్మిదేళ్ల పాటు ఆమె కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి