నా జీవితంలో అతడే గొప్ప క్రికెటర్..పాక్ బౌలర్‌పై బాలీవుడ్ స్టార్ హీరో ప్రశంసలు

నా జీవితంలో అతడే గొప్ప క్రికెటర్..పాక్ బౌలర్‌పై బాలీవుడ్ స్టార్ హీరో ప్రశంసలు

మన దేశంలో స్టార్ క్రికెటర్లకు కొదువ లేదు. బ్యాటింగ్, బౌలింగ్ ఏ విధంగా చూసుకున్న ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లు భారత క్రికెట్ లో తమదైన ముద్ర వేశారు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్, మహేంద్ర సింగ్ ధోనీ, యువ రాజ్ సింగ్ లాంటి బ్యాటర్లు.. అదే విధంగా అనీల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, జవగళ్ శ్రీనాద్, జహీర్ ఖాన్, అజిత్ అగార్కర్, వెంకటేష్ ప్రసాద్ లాంటి బౌలర్లు భారత జట్టుకు ఎన్నో సేవలను అందించారు. అయితే బాలీవుడ్ స్టార్ హీరోకు మాత్రం పాక్ మాజీ  బౌలర్ వసీం అక్రమ్ అంటే ఇష్టమట. 
           
దుబాయ్‌ వేదికగా నిన్న (జనవరి 31) జరిగిన ఒక కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పాకిస్థాన్ మాజీ పేసర్ వసీం అక్రమ్ రివర్స్ స్వింగ్ బౌలింగ్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు. అక్రమ్ గొప్ప బౌలర్లలో ఒకడని..అతను ఆడే రోజుల్లో రివర్స్ స్వింగ్ లో సిద్ధహస్తుడని తెలిపాడు. తన మొత్తం జీవితంలో చూసిన 'గొప్ప క్రికెటర్లలో అక్రమ్ ఒకడని.. అతని రివర్స్ స్వింగ్  బ్యాట్స్‌మెన్‌లను భయపెడుతుందని చెప్పాడు. "వాసీం భాయ్ కి రివర్స్ స్వింగ్ సే సబ్ దర్ జాతయ్ థాయ్" అంటూ అక్రమ్ ను ప్రశంసలతో ముంచెత్తాడు. అయితే ఈ కార్యక్రమంలో ఏ భారత క్రికెటర్ పేరు చెప్పకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది.    
   
అంతర్జాతీయ క్రికెట్ లో వసీం అక్రమ్ గొప్ప బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. వన్డేల్లో 500 వికెట్లు తీసిన తొలి బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. 2003 వరల్డ్ కప్ లో ఈ ఘనత సాధించాడు. మొత్తం 350 వన్డేల్లో 502 వికెట్లు, 104 టెస్టుల్లో 414 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో మొత్తం 31 సార్లు 5 వికెట్ల ఘనత అందుకున్నాడు. 2003 వన్డే వరల్డ్ కప్ ఓటమి తర్వాత అక్రమ్ అంతర్జాతీయ క్రికెట్ కు వసీం అక్రమ్ రిటైర్మెంట్ ప్రకటించాడు.  

క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత వసీం అక్రమ్ 2010లో కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలింగ్ కోచ్ గా పని చేసాడు. ఉమేష్ యాదవ్  మహ్మద్ షమీ వంటి ప్రతిభావంతులైన భారత పేసర్లను తీర్చిదిద్దాడు. ఆ తర్వాత పాకిస్తాన్ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా పని చేసి జునైద్ ఖాన్, మహ్మద్ అమీర్ లాంటి గొప్ప పేసర్లను పాక్ జట్టుకు అందించాడు. 2016, 2017లో పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఇస్లామాబాద్ యునైటెడ్‌కు బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. ప్రస్తుతం కరాచీ కింగ్స్‌కు ఛైర్మన్, బౌలింగ్ కోచ్‌గా ఉన్నారు.