
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కి ప్రధాని మోదీ మంత్రిత్వ శాఖలను కేటాయించారు. కోల్, మైన్స్ శాఖలను కేబినెట్ మంత్రి కిషన్‌రెడ్డికి అప్పగించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బాధ్యతలను బండి సంజయ్‌కి ఇచ్చారు. 2019 లో(మోదీ సెకండ్ టర్మ్ పాలనలో) తొలిసారి కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డికి అప్పట్లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవి దక్కింది.
దాదాపు రెండేండ్ల తర్వాత సహాయ మంత్రి పదవి నుంచి కేబినెట్ మంత్రిగా ఆయనకు ప్రమోషన్ వచ్చింది. అందులోనూ సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖలను అప్పగించారు. ప్రస్తుతం కేబినెట్ మంత్రిగా కిషన్‌రెడ్డికి కీలమైన బొగ్గు, గనుల శాఖలు దక్కాయి.
గత ప్రభుత్వంలో ఈ మంత్రిత్వ శాఖలను ప్రహ్లాద్ జోషి నిర్వర్తించారు. ఇక.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బాధ్యతలను బండి సంజయ్‌కి అప్పగించారు. ప్రస్తుతం మళ్లీ కేంద్ర హోం శాఖ మంత్రిగా అమిత్ షా నియమితులవగా.. ఆయన శాఖలో సహాయ మంత్రులుగా బండి సంజయ్ , నిత్యానంద్ రాయ్ కు అవకాశం దక్కింది.
మోదీ సెకండ్ టర్మ్ పాలనలో తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డి కొన్నాళ్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టగా.. ఇప్పుడు తెలంగాణ నుంచే బండి సంజయ్‌కి ఆ బాధ్యతలు దక్కాయి. కాగా, తెలంగాణకు చెందిన విద్యాసాగర్ రావు కూడా వాజ్‌పేయి హయాంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.