IPL 2025: 75 మ్యాచ్‌లకు ఒకసారి ఆడతాడు.. స్టార్ ఆటగాడిని హేలీ తోకచుక్కతో పోల్చిన సంజయ్

IPL 2025: 75 మ్యాచ్‌లకు ఒకసారి ఆడతాడు.. స్టార్ ఆటగాడిని హేలీ తోకచుక్కతో పోల్చిన సంజయ్

ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ ఐపీఎల్ లో తన పేలవ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున గత సీజన్ లో ఒక్క మెరుపు ఇన్నింగ్స్ కూడా లేకపోగా ప్రతి ఇన్నింగ్స్ లో ఘోరంగా విఫలమయ్యాడు. అయితే 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో పంజాబ్ అతన్ని నమ్మి రూ. 4.2 కోట్లకు తీసుకుంటే తొలి మ్యాచ్ లోనే డకౌటయ్యాడు. ఆడిన తొలి బంతికే సాయి కిషోర్ ఫ్యాన్స్ రివర్స్ స్వీప్ ఆడి ఎల్బీడబ్ల్యూ రూపంలో వికెట్ సమర్పించుకున్నాడు. రెండో మ్యాచ్ లో బ్యాటింగ్ ఆడే అవకాశం రాకపోగా మూడో మ్యాచ్ లో ఒక సిక్స్, మూడు ఫోర్లతో పర్వాలేదనిపించాడు. 

ఐపీఎల్ లో మ్యాక్స్ వెల్ తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించక చాలా కాలమే అయింది. స్టార్ ఆటగాడిగా ప్రతి మ్యాచ్ లో ప్లేయింగ్ 11 లో చోటు కల్పించినా తీవ్రంగా నిరాశకు గురి చేస్తున్నాడు. ఈ ఆసీస్ స్టార్ ఆటగాడి ప్రదర్శనను కామెంటేటర్, భారత మాజీ క్రికెటర్  సంజయ్ మంజ్రేకర్ దారుణంగా విమర్శించాడు. ప్రస్తుతం జరుగుతున్నా ఐపీఎల్ లో మ్యాక్స్ వెల్ ఇంకా తన ఆటను నిరూపించుకోలేదని చెప్పిన మంజ్రేకర్ అతని బ్యాటింగ్ ను 75 సంవత్సరాలకు ఒకసారి కనిపించే 'హాలీస్ కామెట్'తో పోల్చాడు.

Also Read:-చాలా రోజులు ఆ బాధ నుంచి బయటకు రాలేకపోయాను

"హేలీ తోకచుక్క సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ప్రతి 75 సంవత్సరాలకు ఒకసారి భూమి నుండి కనిపిస్తుంది. అదేవిధంగా గ్లెన్ మ్యాక్స్ వెల్ 75 మ్యాచ్ ల్లో ఒక మంచి ఇన్నింగ్స్ మాత్రమే ఆడతాడు. హేలీ తోక చుక్క చివరిసారిగా 1986లో కనిపించింది. ఇది మళ్ళీ 2061లో కనిపిస్తుంది. బ్యాటింగ్‌లో మ్యాక్స్ వెల్ విషయంలో కూడా ఇదే పరిస్థితి. మ్యాక్స్ వెల్ క్రికెట్ లో హేలీ తోకచుక్క" అని మంజ్రేకర్ జియోహాట్‌స్టార్‌లో అన్నారు. పక్కనే ఉన్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. మంజ్రేకర్‌తో విభేదించాడు. మాక్స్‌వెల్ ప్రతి 25 మ్యాచ్ లలో ఒకసారి రాణిస్తాడని చెప్పుకొచ్చాడు. 

మ్యాక్స్ వెల్ ఇదే ప్రదర్శన కొనసాగితే అతను తుది జట్టులో చోటు సంపాదించుకోవడం కూడా కష్టంగా కనిపిస్తుంది. ఐపీఎల్ 2024 సీజన్ లో బెంగళూరు తరపున అట్టర్ ఫ్లాప్ షో చేశాడు. మొత్తం 9 ఇన్నింగ్స్ ల్లో 52 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. వీటిలో నాలుగు డకౌట్స్ ఉన్నాయి. స్టార్ ప్లేయర్ అని వరుస అవకాశాలు ఇస్తుంటే ఒక్క మ్యాచ్ లో కూడా ప్రభావం చూపించలేకపోయాడు. బ్యాటింగ్ ఇలా వచ్చి అలా వెళ్ళాడు. పట్టుమని పది బంతులు ఆడకుండా కనీసం రెండంకెల స్కోర్ చేయకుండానే పెవిలియన్ కు చేరుతున్నాడు. రూ. 11 కోట్ల భారీ ధరకు దక్కించుకున్న ఆర్సీబీ నిరాశ తప్పలేదు.